ఆయన సరదా.. కొలంబియా కొంప ముంచుతోంది!

తాజా వార్తలు

Updated : 13/06/2021 12:09 IST

ఆయన సరదా.. కొలంబియా కొంప ముంచుతోంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు కొలంబియాలో ఆయనో పెద్ద డ్రగ్స్‌ మాఫియా కింగ్‌.. సరదాగా నాలుగు నీటి ఏనుగులను పెంచుకున్నాడు. అప్పుడంతా బాగానే ఉంది. కానీ, ఆయన మృతి చెందిన తర్వాత ఆ నాలుగు నీటి ఏనుగుల్ని ఎవరూ పట్టించుకోలేదు. అవే ఇప్పుడు కొలంబియా వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారాయి. ఆ నీటి ఏనుగుల సంతానం ప్రస్తుతం కొలంబియా వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తున్నాయి.

పాబ్లో ఎస్కోబార్‌.. 1980ల్లో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ మాఫియాకి డాన్‌గా ఎదిగాడు. అవినీతి డబ్బులే అయినా.. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా అతడికి పేరుంది. ఆయన కుమార్తె చలికాచుకోవడం కోసం కరెన్సీ నోట్ల కట్టలతో మంట పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు పాబ్లో ఎంత సంపన్నుడో. అయితే, ఓ సారి అమెరికా జూ నుంచి నాలుగు నీటి ఏనుగుల్ని తెప్పించుకున్నాడు. ఆంటియోక్వియాలోని ప్యూర్టో ట్రియూన్ఫోలో ఉన్న తన విలాసవంతమైన హాసియండా నెపోల్స్‌ ఎస్టేట్‌కి తీసుకెళ్లి పెంచుకున్నాడు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న పాబ్లోను పట్టుకునేందుకు పోలీసు బలగాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఎట్టకేలకు పోలీసులు 1993లో పాబ్లోను కనిపెట్టి కాల్చి చంపారు. దీంతో డ్రగ్స్‌ మాఫియా అంతమైంది. పాబ్లో నివాసాల్లో ఉన్న అనేక వస్తువులు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎస్టేట్‌లోనే ఉన్న నీటి ఏనుగుల్ని ఏం చేయాలో తెలియక అలాగే వదిలేశారు. 

ఎవరూ కన్నెత్తి చూడని ఆ ఎస్టేట్‌లో ఆ నాలుగు నీటి ఏనుగులు మాత్రమే నివసించేవి. 2007 నాటికి వాటి సంఖ్య 16కి చేరింది. అక్కడ ఆహారం దొరక్క జనావాసంలోకి రావడం, మనుషులపై దాడి చేయడం మొదలుపెట్టాయి. కొన్ని అడవుల్లోకి, మరికొన్ని ఇతర ప్రాంతాలకు పారిపోయి సంతానోత్పత్తిని పెంచాయి. దీంతో కొలంబియా వ్యాప్తంగా ప్రస్తుతం వీటి సంఖ్య 100 వరకు ఉంటుందని అంచనా. అయితే, వీటి వల్ల స్థానిక పర్యావరణానికి, వృక్ష, జంతు జాలానికి ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. నీటి ఏనుగుల వల్ల వన్యప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయని, నది.. చెరువుల్లో దిగి నీటిని కాలుష్యం చేస్తున్నాయని తెలిపారు. వీటి మలంలో ఉండే విషపూరిత పదార్థాలు నీటిలో ఉండే చేపలకు ప్రాణసంకటంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఏనుగుల సంఖ్య ఇప్పుడు నియంత్రించకపోతే 2039 నాటికి వాటి సంఖ్య 1,400కి చేరుతుందని, అప్పుడు వాటిని నియంత్రించడం కష్టమని పేర్కొన్నారు. మరోవైపు వీటి సంఖ్య తగ్గించి, కొన్నింటిని మరో ప్రాంతానికి తరలించాలని స్థానిక అధికారులు యోచిస్తుంటే.. జంతు ప్రేమికులు మాత్రం అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి నీటి ఏనుగుల బెడద కొలంబియాకు తప్పుతుందో లేదో.. వేచి చూడాలి!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని