శవంతో జర్నీ.. పరిగెడతావా? ఫైన్‌ కడతావా?

తాజా వార్తలు

Published : 17/09/2020 19:55 IST

శవంతో జర్నీ.. పరిగెడతావా? ఫైన్‌ కడతావా?


ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘శవంతో ప్రయాణం’.. ‘దొరికావా గోతులు తీయి’.. ‘పరిగెడతావా.. ఫైన్‌ కడతావా?’ ఆ మధ్య కరోనా నేపథ్యంలో పేరడీగా వచ్చిన సినిమా పేర్లు గుర్తొస్తున్నాయి కదూ. కానీ, ఇవి సినిమా పేర్లు కాదు. కొవిడ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న కొత్త శిక్షలు. ఈ కొత్త కాన్సెప్ట్‌లకు రూపకర్తలు ఇండోనేసియాలోని స్థానిక అధికారులు. ‘ఏమవుతుందిలే’ అన్న నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై ఇలా తమదైన పద్ధతిలో వినూత్న శిక్షలు విధిస్తూ కొవిడ్‌ నియంత్రణకు కృషి చేస్తున్నారు.

మాస్కులు ధరించకుండా దొరికిన వ్యక్తులపై తూర్పు జావాలోని అధికారులు ‘శవంతో ప్రయాణం’ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. ఎవరైనా మాస్కు ధరించకుంటే వారిని కొవిడ్‌-19తో మరణించిన వ్యక్తుల వ్యాన్‌లో ఎక్కించి ప్రయాణం చేయిస్తారు. ఇటీవల ఓ కూరగాయల మార్కెట్లో నిబంధనలు పాటించని 50 మందికి ఈ విధంగా శిక్షలు విధించారట. తూర్పు జావాలోని అధికారులైతే మాస్కులు ధరించని వారికి శవాలకు గోతులు తవ్వే పని చెబుతున్నారు. ‘నిల్చుంటావా? పరిగెడతావా?’ ఎవరైనా మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా చిక్కితే వారిని అక్కడి అధికారులు అడిగే ప్రశ్నలివీ. నిల్చోవడమే కదా మాస్టారు ఈజీనే కదా అనుకునేరు. అరగంట సేపు మండుటెండలో నిల్చోవాలి. లేదంటే ఓ 800 మీటర్లు పరుగెత్తి వచ్చి ఓ 10 పుషప్స్‌ తీయిస్తారు.

మాస్కు ధరించకపోతే వారితో పార్కుల్లో గడ్డి పీకిస్తున్నారు లహోక్సేయుమావె ప్రాంతానికి చెందిన అధికారులు. వారికి విధించిన శిక్ష పూర్తయ్యాక ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తారు. ఒకసారి శిక్ష పడిన వారు మళ్లీ మళ్లీ తప్పు చేయకుండా వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు.  తూర్పు జకర్తాలోనైతే గంటసేపు కాలువ శుభ్రం చేయిస్తున్నారు.. లేదంటే జరిమానా కట్టమంటున్నారు. అంతే కాదు.. ఎవరైనా బైక్‌పై వెళ్లేటప్పుడు మాస్కు ధరించకుండా కనిపిస్తే వారిని దెయ్యం ముసుగులో ఉన్న అధికారులు ఆపి భయపెట్టడమే కాదు.. మాస్కు పెట్టుకోకుంటే జరిగే అనర్థాలను వివరించి మాస్కు అందిస్తున్నారు. ఇలా విధిస్తున్న ‘అపరిచిత శిక్షలు’ కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయని చెబుతున్నారు అక్కడి అధికారులు. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కేసులు దాదాపు 2.20 లక్షలు చేరగా.. ఇప్పటి వరకు సుమారు 9 వేల మంది మరణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని