10 రోజుల్లోనే నిండుకున్న 40 శాతం పడకలు

తాజా వార్తలు

Published : 17/04/2021 12:20 IST

10 రోజుల్లోనే నిండుకున్న 40 శాతం పడకలు

పలు జిల్లాల్లో ఆక్సిజన్‌ బెడ్లు ఫుల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రెండో దశ తీవ్ర రూపం దాలుస్తోంది. లక్షణాలు లేనివారిలో పెద్దగా ప్రభావం చూపకపోయినా కొందరిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆక్సిజన్‌ లేకపోతే క్షణాల్లోనే ఆయువు తీసేస్తోంది. కొవిడ్ రెండో వేవ్‌ విజృంభిస్తు్న్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్‌ పడకల కొరత పెరిగింది. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లోనూ ఆక్సిజన్‌ పడకలు దొరకడం లేదు. 

కరోనా వైరస్‌ లక్షణాలు పెరిగినవారికి ఆక్సిజన్‌ తప్పనిసరి అన్న డబ్ల్యూహెచ్‌ఓ సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం 22 ప్రభుత్వాసుపత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటుచేసింది. 6044 ఆక్సిజన్‌ పడకలను కొవిడ్‌ రోగుల కోసం కేటాయించింది. మరో 1707 ఐసీయూ పడకలను సైతం అందుబాటులో ఉంచింది. ప్రైవేటులోనూ 5813 ఆక్సిజన్‌ పడకలు కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 11,857 ఆక్సీజన్‌ బెడ్లను కొవిడ్‌ రోగుల కోసం కేటాయించారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తుండటం.. అందులోనూ లక్షణాలు ఉన్నవారిలో అత్యధికులకు ఆక్సిజన్‌ అవసరమవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ  పడకలు వేగంగా నిండుకుంటున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీతోపాటు నిజామాబాద్‌ జిల్లాలో ఆక్సిజన్‌ పడకల కొరత ఏర్పడుతోంది. 

రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలోని 6044 ఆక్సిజన్‌ పడకలకుగానూ 4401 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుకు మొత్తం 5813 ఆక్సిజన్‌ పడకలను కేటాయించగా అందులో ఇప్పటికే 3294 నిండుకున్నాయి. ఖాళీగా ఉన్నవి కేవలం 2519 మాత్రమే. ప్రైవేటులో దాదాపు 57 శాతం పడకలు ఇప్పటికే నిండుకున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి కేవలం 58 శాతం పడకలు మాత్రమే ప్రస్తుతం ఖాళీగా ఉండగా గడిచిన 10 రోజుల్లోనే సుమారు 40 శాతం పడకలు నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్లలో ఆక్సిజన్‌ పడకలు దాదాపు నిండుకున్నాయి. సిరిసిల్లలో 40 ఆక్సిజన్‌, 10 ఐసీయూ పడకలు కొవిడ్‌ రోగులకు కేటాయించగా మొత్తం అన్నీ నిండుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ పడకలు కేటాయించకపోవడం గమనార్హం. ఫలితంగా కొత్తగా ఎవరికైనా ఆక్సిజన్‌ పడకలు కావాలంటే.. ఉన్నవారు కోలుకోవాలి లేదా చుట్టుపక్కల జిల్లాలకు తరలించాల్సిన పరిస్థితి. నిజామాబాద్‌లో మహమ్మారి జోరుగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. ఆసుపత్రులకు ఆక్సిజన్‌ అవసరంతో వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానాల్లో 226 ఆక్సిజన్‌ పడకలు ఉండగా అందులో 57 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో అయితే 103 ఆక్సిజన్‌ పడకలకు కేవలం 7 మాత్రమే అందుబాటులో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జీహెచ్‌ఎంసీ పరిధి ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 2248 ఆక్సిజన్‌ పడకలకు 1541 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో మాత్రం 1938 ఆక్సిజన్‌ పడకలకు కేవలం 448 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా చిన్నాచితకా ఆసుపత్రుల్లో మిగిలి ఉన్నాయి. దీంతో పెద్దాసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. కింగ్‌కోఠి, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పూర్తిగా ఆక్సీజన్‌ పడకల కొరత ఏర్పడింది. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 8 ఆక్సీజన్‌ పడకలకు అన్నీ నిండుకున్నాయి. కరీంనగర్‌లో 137 పడకలకు 52 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఆక్సిజన్‌ బెడ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వారం, పది రోజుల్లోనే కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ పడకలు దొరకని పరిస్థితి ఎదురుకావచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని