Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 30/09/2021 08:58 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. ఇంటర్‌లో 70% సిలబస్సే!

ఈ విద్యా సంవత్సరం(2021-22) కూడా ఇంటర్‌ మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్సే ఉండనుంది. కరోనా పరిస్థితుల కారణంగా గత ఏడాది 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 70 శాతం సిలబస్‌ ఆధారంగానే పరీక్షలు ఉండేలా చూడాలని సూచిస్తూ కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. 

మధ్యాహ్న భోజనం మరో 5 ఏళ్లు

2. దక్షిణ గంగ గరళంగా...

దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి గరళంగా మారుతోంది. తెలంగాణలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్‌(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

3. bill payments: బిల్లుల గోస!

బిల్లులు... బకాయిలు... పెండింగు... నిధుల కొరత... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.... కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు... పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న వారికి రూ.500 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఆపై పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు.

4. సూపర్‌ఫాస్ట్‌గా 6 ఎక్స్‌ప్రెస్‌లు.. 22 ప్యాసింజర్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు

ఆరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 22 ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ రైళ్లకు కొత్త నంబర్లను రైల్వేశాఖ కేటాయించింది. కొన్ని రైళ్లకు ప్రయాణమార్గాలను కూడా మార్చింది. తాజా మార్పులతో రైలు ప్రయాణికులకు టికెట్ల రూపంలో ఛార్జీల భారం పెరగనుంది.

5. Covid: ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్‌ సోకినట్టే!

కొవిడ్‌ పరీక్ష వసతులు అంతగా లేనిచోట- టెస్టింగ్‌ కిట్లను సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ... పరిశోధకులు 7 లక్షణాలను పేర్కొన్నారు. రుచి, వాసనలను కోల్పోవడం లేదా వాటిని గుర్తించే సామర్థ్యం తగ్గడం, చలి, దగ్గు, జ్వరం, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం - ఈ లక్షణాలు ఉన్నవారికి కరోనా సోకిందని ప్రాథమికంగా భావించవచ్చని, కిట్ల కొరత ఉన్నప్పుడు ముందుగా ఇలాంటి వారికి పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు.

6. న్యాయస్థానాల ప్రతిష్ఠ కోసమే కోర్టు ధిక్కరణలకు శిక్ష

న్యాయ స్థానాల ప్రతిష్ఠను కాపాడడానికే వాటికి ‘కోర్టు ధిక్కరణలకు శిక్షించే’ అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టిందని బుధవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదేమీ కక్ష తీర్చుకోవడానికి ఉద్దేశించింది కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానాలకు ఉన్న అధికారాలను ఎవరూ తీసుకోలేరని తెలిపింది. చట్టసభల్లో శాసనాలు ద్వారా కూడా దీన్ని హరించలేరని స్పష్టం చేసింది.

శ్రీవారి సేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైఏం చేశారు?: సీజేఐ

7. రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు అండాదండా

మహిళలకు సోకే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ మొదటి స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నామని తెలియగానే.. మహిళలు దిగ్భ్రాంతి, భయం, కోపం, నిస్సహాయత వంటి పలు భావోద్వేగాలకు లోనవుతారు. చికిత్స సమయంలో క్రమేపీ కుంగుబాటుకు గురవుతారు. వారికి కౌన్సెలింగ్‌ చేయడం చాలా అవసరం. ఈ ఉద్దేశంతోనే బాధితుల్లో మనోధైర్యం నింపడానికి ‘ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌’ తొలిసారిగా ఉచిత హెల్ప్‌లైన్‌ నంబరు ‘08046983383’ను అందుబాటులోకి తీసుకొస్తోంది. 

8. మార్చి వరకు అత్యవసర రుణ హామీ పథకం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎమ్‌ఈలు) ప్రకటించిన రూ.4.5 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) గడువును ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది.  2022 మార్చి 31 వరకు ఈ పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన వ్యాపారులు, పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ఈసీఎల్‌జీఎస్‌ పథకాన్ని పొడిగించాల్సిందిగా వివిధ పరిశ్రమ సంఘాలు, సంబంధిత వర్గాల నుంచి వినతులు వచ్చాయని పేర్కొంది.

9. PAK Terrorist: లష్కరే శిక్షణ పొందా

కశ్మీర్‌లో చొరబాటుకు యత్నించి, భారత సైన్యానికి చిక్కిన ఉగ్రవాది అలీ బాబర్‌ పాత్రా (19) సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను పాకిస్థాన్‌కు చెందినవాడినని అంగీకరించాడు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తనకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించాడు. ఈనెల 26న ఉరి సెక్టార్‌ వద్ద ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో భారత సైనికులు అతడిని పట్టుకున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఉగ్రవాద శిక్షణ పొందడానికి దారితీసిన పరిస్థితులపై  మీడియాతో మాట్లాడాడు.

10. బెంగళూరు అదరహో..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండ్‌ జోరుతో అదరగొట్టింది. మ్యాక్స్‌వెల్‌ (50 నాటౌట్‌; 30 బంతుల్లో  6×4, 1×6), వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌ (44;  35 బంతుల్లో 3×4, 1×6) మెరవడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట రాజస్థాన్‌ 9 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని