ఐజాక్‌ ముండా ఈటింగ్..

తాజా వార్తలు

Published : 09/07/2021 01:29 IST

ఐజాక్‌ ముండా ఈటింగ్..

భువనేశ్వర్: ఐజాక్ ముండా.. ఒక రోజూవారీ కూలీ. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ ఆయన పొట్టకూటిని దెబ్బకొట్టింది. ఉన్న కొద్దిపాటి రాబడి పోయేసరికి ఆ కుటుంబం ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఈ ఆకలి బాధను తప్పించుకునేందుకు ఐజాక్ యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలు పెట్టారు. అప్పుడే ఫుడ్ బ్లాగర్లు పెట్టే వీడియోలు తన కంట పడ్డాయి. అలాగే తనూ ఎందుకు చేయకూడదనే ఆలోచన.. తన కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్థితికి తెచ్చింది. వారిలాగే తనూ రకరకాల వంటలను సిద్ధం చేసి, తింటూ ఉండే వీడియోలను పోస్టు చేసేందుకు ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. 

తినడానికి తిండి లేని ఐజాక్‌కు వీడియోలు తీయడానికి, వంటలు సిద్ధం చేసుకోవడానికి డబ్బు కావాల్సి వచ్చింది. అందుకోసం రూ.3,000 వేలు అప్పుచేసి, స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. ‘వీడియో తీసేందుకు మూడు వేల రూపాయలు పెట్టి ఒక ఫోన్‌ కొన్నాను. అందుకోసం అప్పు చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి పేదరికం తాండవిస్తోన్న ఇల్లు, ఊరిలో నా జీవితం ఎలా ఉంటుందో తెలిసేలా వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టాను. మేం ఏం తింటాం? ఎలా తింటాం? మొత్తం వాటిలో చూపిస్తున్నాం. నా వీడియోలకు మంచి ఆదరణ దక్కడం సంతోషాన్ని కలిగిస్తోంది. కొద్దిపాటి ఆదాయమూ సమకూరుతోంది’ అంటూ ఐజాక్ మీడియాకు వెల్లడించారు.  

మొదట్లో అన్నం, కూర, ఒక మిరపకాయ, టమాటాను ఒక పళ్లెంలో ఉంచి, ఆబగా తింటున్నట్టుగా తీసిన వీడియో నెట్టింట్లో క్లిక్‌ అయింది. దానిని 5లక్షల మంది వీక్షించారు. ఇలా తన ఆహారశైలి గురించి తీసిన వీడియోలను ‘ఐజాక్‌ ముండా ఈటింగ్’ అనే యూట్యూబ్ ఛానల్‌లో పొందుపరుస్తున్నారు. ఆ ఛానల్‌కు ఇప్పటివరకు 7లక్షల మంది చందాదారులు ఉన్నారు. తన వీడియోల గురించి ముండా ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ.. వీడియోలు తీసి డబ్బు సంపాదించడం ఒక్కటే తన లక్ష్యం కాదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం గురించి ప్రపంచానికి తెలియజేయడమూ ఒక ఉద్దేశమని వెల్లడించారు. ఇకపై కూలీగా పనిచేయాల్సి లేకపోవడం తనకు ఆనందంగా ఉందనే ఐజాక్‌ది ఒడిశాలోని సంబల్‌పూర్‌.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని