ఎలుకల పాలైన రూ. 2లక్షల వృద్ధుడి కష్టార్జితం 

తాజా వార్తలు

Updated : 17/07/2021 17:26 IST

ఎలుకల పాలైన రూ. 2లక్షల వృద్ధుడి కష్టార్జితం 

మహబూబాబాద్: ‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం’ అనేది నానుడి. కానీ, మహబూబాబాద్ జిల్లాలో ఓ ఎలుక చెలగాటం ఓ నిరుపేదకు ప్రాణసంకటంగా మారింది. అనారోగ్యం బారిన పడిన ఓ వృద్ధుడు శస్త్రచికిత్స కోసం దాచుకున్న డబ్బును ఎలుకలు కొరికేశాయి. దాదాపు రూ.2 లక్షలకు పైనే నగదును పనికి రాకుండా చేశాయి. 500 నోట్లన్నింటికీ రంధ్రాలు చూసిన వృద్ధుడు బోరున విలపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారు ఇందిరానగర్ తండాకు చెందిన రెడ్యా కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ ఉదయాన్నే టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తారు. కూరగాయలు అమ్మగా వచ్చిన దాంతోనే కాలం వెల్లదీస్తున్నారు. వృద్ధాప్యంలోనూ కష్టపడుతూ తన కాళ్లపై తాను నిలబడుతున్నారు. 

నాలుగేళ్లుగా ఆయన కడుపులో కణితి పెరుగుతూ ఇబ్బంది పెడుతోంది. ఆస్పత్రులకు తిరిగితే రూ.4 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అయినా అయన అధైర్య పడకుండా కూరగాయలు అమ్మగా వచ్చిన నగదును ఇంట్లోనే భద్రపరిచారు. ఇలా రూ.2లక్షల వరకు కూడబెట్టారు. మరో రూ.2 లక్షలైతే ఆపరేషన్ చేయించుకోవచ్చని భావించారు. అప్పుగా తెచ్చిన మరో రూ.రెండు లక్షలు బీరువాలో దాచిపెట్టారు. శస్త్రచికిత్స చేయించుకుందామని నగదును తీసి చూసిన రెడ్యా నిర్ఘాంతపోయారు. నోట్లన్నీ ఎలుకలు కొట్టేయడంతో విలపిస్తున్నారు.

చిరిగిపోయిన నోట్లను తీసుకోవాలని మండలంలోని అన్ని బ్యాంకులను సంప్రదించినా నిరాశే ఎదురైంది. హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. అక్కడ కూడా ఎలుకలు కొరికిన నోట్లు తీసుకుంటారో? లేదో? అనే సందేహాల నడుమ వృద్ధుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని