Seasonal diseases: హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి: డీహెచ్‌ శ్రీనివాస్‌

తాజా వార్తలు

Updated : 13/09/2021 19:58 IST

Seasonal diseases: హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి: డీహెచ్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్, సీజనల్ వ్యాధులుపై సీఎం కేసీఆర్‌ సమీక్షించినట్లు డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు  ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు.  2019లో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 4వేలు రిపోర్ట్ కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డెంగ్యూ ప్లేట్‌లెట్స్‌పై కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ మొదలు పెట్టాయని.. జనాలను పరుగులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు 104కి ఫిర్యాదు చేయవచ్చునని డీహెచ్ సూచించారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదవుతున్నాయని.. అక్టోబర్ నెలాఖరు వరకు వైరల్‌ జ్వరాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.

‘‘కొత్త వేరియంట్ వస్తే తప్ప తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు. అలా అని ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే. రాష్ట్రంలో 0.4శాతం మాత్రమే పాజిటివిటీ రేట్ ఉంది. కొవిడ్ పూర్తి నియంత్రణలో ఉంది. విద్యాసంస్థలు పునఃప్రారంభం అయినందున కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయనుకున్నాం. కానీ ఎక్కడా క్లస్టర్ బ్రేక్  చోటుచేసుకోలేదు. తల్లిదండ్రులు వారి పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపవచ్చు. ఇప్పటివరకూ 1.15 లక్షల మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 55 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. భవిష్యత్‌లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. 40 శాతం ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ ప్లాంట్స్‌తో సిద్ధంగా ఉన్నాయి. 3,600కు పైగా పడకలను చిన్నారుల కోసం సిద్ధంగా ఉంచాం.

గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిత్యం 3లక్షల వ్యాక్సిన్ డోసులు అందించేందుకు సమాయత్తం అవుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 20లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ కొరత ఎక్కడా లేదు. వంద మందికి కొవిడ్‌ పరీక్షలు చేస్తే ఒక్కరిద్దరికి మాత్రమే పాజిటివ్‌ వస్తుంది. అన్ని ప్రభుత్వ డయాగ్నొస్టిక్ సెంటర్స్‌లో కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఆన్‌ వీల్స్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 96శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. రాష్ట్రంలో 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. వారిలో 51శాతం మందికి రెండు డోసులు వేశాం. 49 శాతం మంది ఇంకా వ్యాక్సిన్ తీసుకోని జాబితాలో ఉన్నారు’’ అని డీహెచ్ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని