AMARA RAJA GROUP: యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం: గల్లా రామచంద్రనాయుడు

తాజా వార్తలు

Updated : 13/08/2021 18:59 IST

AMARA RAJA GROUP: యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం: గల్లా రామచంద్రనాయుడు

తిరుపతి: పారిశ్రామిక వేత్తగా ఎదిగేందుకు జీవితంలో అనేక మెట్లు ఎక్కామని అమర రాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పారిశ్రామిక వేత్తగా తాను ఎదిగిన క్రమాన్ని వివరించారు. ‘‘నా తండ్రి నిరక్షరాస్యుడే కానీ, చాలా తెలివైన వ్యక్తి. ఆయన చొరవ, ముందుచూపు ఉన్న వ్యక్తి. అవే లక్షణాలు నాక్కూడా వచ్చాయి. చిన్నప్పుడు స్వగ్రామంలోనే అనేక విషయాలు నేర్చుకున్నా.నాజీవితంలో మరో గొప్ప వ్యక్తి మా మేనమామ పి.రాజగోపాలనాయుడు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు. నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసేవారు. ఎప్పుడూ పల్లెలు, రైతులు, కూలీల గురించే ఆలోచించేవారు. మా తండ్రి, మేనమామ నుంచి అనేక విషయాలు నేర్చుకున్నా.  అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదగాలని కోరుకున్నా. రాజగోపాలనాయుడు స్ఫూర్తితోనే ప్రజాసేవలోకి వచ్చాం. వ్యవసాయ రంగంపై ఆధారపడే వారు క్రమంగా తగ్గుతున్నారు. యువతకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది నా లక్ష్యం’’ అని రామచంద్రనాయుడు వివరించారు.

అమరరాజా ప్రస్థానం ఇలా మొదలైంది..

‘‘మన దేశంలో గ్రామాల్లో నివసించే వారే అధికం. గ్రామీణులకు ఏదైనా చేయాలని చిన్నప్పుడే అనుకున్నా. 18 ఏళ్లు అమెరికాలో ఉండి స్వదేశానికి తిరిగి వచ్చా. మొట్టమొదటగా 22 మందితో పరిశ్రమను మొదలుపెట్టాం. ఈరోజు అన్ని ప్లాంట్లలో కలిపి ప్రత్యక్షంగా  18వేల మందికి ఉపాధి కల్పించాం. ఇంతకు 3 రెట్ల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాం. చిత్తూరు జిల్లాలో రూ.6వేల కోట్లు పెట్టుబడులు పెట్టాం. మా ప్లాంట్లన్నీ గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారినే ఉద్యోగులుగా తీసుకున్నాం. విద్యార్హత లేని వారికి కూడా ఉద్యోగాలిచ్చాం.  అనంతరం వారికి శిక్షణ ఇచ్చాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకున్నాం. పరిశ్రమ కోసం వ్యవసాయ భూముల్ని వినియోగించలేదు. పరిశ్రమకు సాగుభూమి వాడకూడదనే నిబంధన పెట్టుకున్నాం. పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపాం. 1985లో చిన్న గ్రామం కరకంబాడిలో పరిశ్రమ విస్తరించాం. అనంతరం మా స్వగ్రామం పేటమిట్టలో పరిశ్రమ స్థాపించా. ఒక్కో అడుగు ముందుకు వేశాం. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ అత్యుత్తమమైన ఉత్పత్తులు అందిస్తూ వచ్చాం. ఎకానమీ అభివృద్ధికి కృషి చేశాం. సొసైటీ కోసం మొదటిసారిగా  మేమే ట్రస్టు కూడా ఏర్పాటు చేశాం. మేం సమాజాభివృద్ధిని కోరుకున్నాం. అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణం’’ అని రామచంద్రనాయుడు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని