నా భర్తను చేరేవరకు..ఆ జ్ఞాపకాలే నాకు తోడు..!

తాజా వార్తలు

Published : 22/07/2021 01:12 IST

నా భర్తను చేరేవరకు..ఆ జ్ఞాపకాలే నాకు తోడు..!

భర్తకు దూరమైన ఓ ఆర్జే చెప్పిన గాథ

ముంబయి: ‘ఆయన హఠాన్మరణంతో అంతా చీకటిగా మారిపోయింది. ఏంటిలా జరిగిపోయిందని ఏడుపు తన్నుకొచ్చేది. కోపం, బాధ, ఒంటరితనం చుట్టుముట్టాయి. నా కౌశిక్ నాకు దూరమై నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆయన లేరనే బాధ తీరనిది. నా భర్తకు ఇష్టమైన వాటిలో ఆయన సజీవంగా ఉన్నారనే ఆలోచనతో ముందుకెళ్తున్నా’ అంటూ ముంబయికి చెందిన రేడియో జాకీ రోహిణీ రామనాథన్ ఉద్వేగానికి గురయ్యారు. తనకు జరిగిన నష్టాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో పంచుకున్నారు. ఆసలు ఆమె ఎందుకు ఒంటరైంది..? దాన్నుంచి ఎలా బయటపడింది..? ఇప్పుడెలా ఉంది..? వీటిపై ఆమె చెప్పిన విషయాలకు నెటిజన్ల కళ్లుచెమర్చాయి. అసలేం జరిగిందంటే..!

ఆకట్టుకునేలా కథలు చెప్పడం రోహిణీ రామనాథన్‌కు ఎంతో ఇష్టం. కౌశిక్‌ అయ్యర్‌కు రాయడమంటే ప్రాణం. ముంబయికి చెందిన ఈ ఆర్జే, ఆ రచయిత ఒక కామన్‌ ఫ్రెండ్ ద్వారా అనుకోకుండా కలుసుకున్నారు. మొదటి పరిచయంలో ఒకరిపై ఒకరికి సదభిప్రాయం కలిగింది. ఆ తర్వాత ఇద్దరి ఆలోచనలు పంచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తుండేవారు. ఈ క్రమంలో మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఇక ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరని వారికి అర్థమైపోయింది. అందుకే కౌశిక్ పెళ్లి ప్రతిపాదన తేగానే.. రోహిణి ‘ఎస్‌’ అంటూ ఎగిరిగత్తేశారు. అలా ఒక్కటైన ఇద్దరు నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. 

కానీ, ఇక్కడే విధి ఓర్వలేకపోయింది. వీరి అన్యోన్యతను చూసి కుళ్లుకుంది. ప్రమాదం రూపంలో ముంచుకొచ్చి, కౌశిక్ ప్రాణాలను తీసుకుపోయింది. ‘ఒక్కసారిగా కౌశిక్ మరణం.. అంతా గందరగోళంగా మారిపోయింది. చుట్టూ చీకట్లు కమ్ముకున్న భావన.. కోపం..బాధ..ఒంటరితనం..అన్ని ఉద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. అన్నింటికి దూరంగా పారిపోవాలనిపించేంది’ అంటూ రోహిణి తను అనుభవించిన బాధను వివరించారు. ఎలాగోలా పనిలో నిమగ్నమవుదామనుకున్న ఆమెను..కొందరి మాటలు సూదుల్లా గుచ్చేవి. పగలంతా గంభీరంగా కనిపించినా..రాత్రుళ్లు ఆమెను ఆమె సముదాయించుకోలేకపోయేవారు. తన భర్త లేని ఒంటరితనాన్ని జీర్ణించుకోలేకపోయేవారు. దాదాపు పదినెలల పాటు ఆమెకు ఇదే పరిస్థితి. తర్వాత ఈ బాధ నుంచి బయటపడాలని ఆమె ఒక థెరపీ తీసుకున్నారు. అదే ఇప్పుడు ఆమెకు సాంత్వన చేకూర్చింది. మళ్లీ మామూలు జీవితం వైపు ఆలోచన చేసేలా చేసింది. 

ఇప్పటికీ ఏదైనా దరఖాస్తులో ‘మ్యారీడ్’ స్థానంలో ‘సింగిల్’ అని నింపాలంటే రోహిణికి ప్రాణం పోయినట్లవుతుంది. అలాంటి ఎన్నో విషయాలను ఆమె తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. భర్తకు ఇష్టమైన వంటలు, వ్యాపకాల్లో ఆయన్ను వెతుక్కోవడం ప్రారంభించారు. ఆయనకు ఇష్టమైన న్యూయార్క్ నగరాన్ని వీక్షించారు. ఇప్పటికి నాలుగేళ్లు గడిచిపోయాయి. ‘మా ఏడేళ్ల ప్రయాణం.. మిగిలిన జీవితానికి కావాల్సిన జ్ఞాపకాలను అందించింది. మళ్లీ ఆయన్ను చేరుకునే వరకు అవే నన్ను నడిపిస్తాయి’ అంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు.

నెట్టింట్లో ఆమె పంచుకున్న ఈ విషయం నెటిజన్ల హృదయాలను మెలిపెట్టింది. ‘మీరు అద్భుతమైన వ్యక్తి. మన ప్రియమైన వారిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటపడటం అసంభవం. కానీ, మీరు మీలో కౌశిక్‌ను సజీవంగా ఉంచుకున్నారు’, ‘మీ కథ కన్నీళ్లు పెట్టించింది’ అని ఉద్విగ్నంగా పోస్టులు పెడుతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని