weather report: మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు

తాజా వార్తలు

Updated : 22/07/2021 18:10 IST

weather report: మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఎల్లుండి ఒకట్రెండు  చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువమానేరు జలాశయం నిండుకుండలా మారింది. పాల్వంచ, కూడవెల్లి వాగుల నుంచి ఎగువమానేరులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. నిర్మల్‌ జిల్లా భైంసా ఆటోనగర్‌లో 60 కుటుంబాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. జగిత్యాల జిల్లా రాయికల్‌లో 19.25 సెంటీమీటర్లు, కుమురంభీం జిల్లా వెంకట్రావుపేటలో 17.3, నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం జామ్‌లో 16.1, సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 20కి పైగా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో...

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు. సముద్రంలోనూ అలల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ  కమిషనర్‌ కన్నబాబు హెచ్చిరకలు జారీ చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని