Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 17/10/2021 17:01 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1) ఉత్తరాఖండ్‌లో రెడ్‌ అలర్ట్‌.. బద్రీనాథ్‌ యాత్రపై ప్రభావం!
నేటినుంచి రానున్న రెండు మూడు రోజులు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన చమోలీ జిల్లా యంత్రాంగం.. ఆదివారం బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా యాత్రికులంతా జోషిమఠ్‌, పాండుకేశ్వర్ వద్దే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ డిస్టిక్‌ మేజిస్ట్రేట్‌ హిమాన్షు ఖురానా విజ్ఞప్తి చేశారు.

2) తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్‌ తరఫున నామినేషన్‌

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేసీఆర్‌ తరఫున ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి మంత్రులు మహమూద్‌ అలీ, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

3) జగన్‌ ఎన్డీయేలో చేరాలని కోరుతున్నా: అథవాలే
మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరధిలోనిదే అని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని.. తను ఎన్డీఏలో చేరాలని కోరారు. ఎన్డీయేలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని.. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామన్నారు.

4) రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు: బాలకృష్ణ

రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పస్టం చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. సీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు.

5) హరీశ్‌రావు అక్కడ నుంచి వెళ్లిపోవాలి.. ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో మంత్రి హరీశ్‌రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి హోదాలో ఉన్న హరీశ్‌రావు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. నెల రోజుల నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.

6) ఒకే ఇన్నింగ్స్‌లో కుంబ్లే పది వికెట్లు చూశారా?

టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఆదివారం 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి సన్నిహితుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు బీసీసీఐ సైతం ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. ‘403 అంతర్జాతీయ మ్యాచ్‌లు 956 వికెట్లు తీయడమే కాకుండా టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా టీమ్‌ఇండియా మాజీ సారథి అనిల్‌ కుంబ్లే నిలిచాడు. ఆ దిగ్గజానికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ 1999లో పాకిస్థాన్‌పై దిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. 

ధోనీ అభిమానులకు శుభవార్త.. వచ్చే ఐపీఎల్‌పై క్లారిటీ..

7) అంతరిక్షంలో సినిమా షూటింగ్‌.. విజయవంతమైన పర్యటన!

గతకొన్నేళ్లుగా అంతరిక్ష యాత్రల్లో ప్రపంచ దేశాలు దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటులోనూ అంతరిక్ష పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేవలం యాత్రలే కాదు తాజాగా అక్కడ సినిమా షూటింగ్‌లు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా రష్యాకు చెందిన చిత్ర బృందం ఏకంగా 12రోజుల పాటు అంతరిక్షంలో షూటింగ్‌ నిర్వహించారు. ఓ సినిమా కోసం ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు (ISS) వెళ్లిన చిత్ర దర్శకుడు, కథానాయిక.. అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించుకొని తాజాగా విజయవంతంగా భూమిని చేరుకున్నారు. 

హాలీవుడ్‌కు సవాలు విసిరిన చైనా సినిమా.

8) స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌.. ఇలా చెక్‌ చేసుకోండి!
కాలం మారింది.. సాంకేతికత సాయంతో కష్టసాధ్యమైన పనులు కూడా సులువుగా జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ లేనిదే పొద్దుపోని పరిస్థితి. అత్యవసర పనుల నుంచి పిచ్చాపాటీ కబుర్ల కోసం దూరంగా ఉన్న బంధుమిత్రులు, స్నేహితులతో సంభాషించేందుకు మొబైల్‌ఫోన్ ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్‌ సమావేశాల వరకూ ఎన్నో విధాలుగా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించాం. దీంతో ఫోన్‌లోని యూజర్‌ డేటా లక్ష్యంగా జరిగే సైబర్‌ నేరాల సంఖ్య కూడా పెరిగిందని సైబర్ సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి.

9)  ఆ సమయంలో ప్రియ మిత్రుడిని కౌగిలించుకుంటే చాలనుకున్నాం..!
కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచదేశాలు ఎంతగా వణికిపోయాయో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో విధించిన లాక్‌డౌన్‌ చాలా మంది జీవితాలపై ప్రభావం చూపింది. ఇతరులకు దగ్గరగా వెళ్లి మాట్లాడాలంటేనే భయపడిపోయాం. ఇంట్లో ఉన్న బంధువులతో, చుట్టుపక్కల వారితో, స్నేహితులతో చనువుగా ఉండలేకపోయాం. తాజాగా కరోనా వ్యాప్తి సమయంలో.. మనం ఒకరు నుంచి ఏం కోరుకున్నాం? మన జీవితాల్ని మహమ్మారి ఏవిధంగా మార్చిందనే విషయాల్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

10) పంజాబ్‌లో ప్రచారాస్త్రాలివే.. సోనియాకు సిద్ధూ లేఖ!

వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రచారంలో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను అందులో పొందుపరిచారు. అలాగే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివరించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన అక్టోబరు 15న లేఖ రాశారు. దాన్ని నేడు ట్విటర్‌లో ఉంచారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని