Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 18/10/2021 17:06 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మేం కళ్లు తెరిస్తే మాడి మసైపోతారు: ఈటల రాజేందర్‌

తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే అని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది భాజపాయే అని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఈటల స్పందిస్తూ తాము కళ్లు తెరిస్తే మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు.

2. ‘మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఫిక్స్‌డ్‌ రేట్ల ఎమ్మెల్యే’

ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన నేత చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ ఆశయాలకు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రతి పనికీ ఎమ్మెల్యే కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. 

3. మోత్కుపల్లి నర్సింహులు.. పరిచయం అక్కర్లేని వ్యక్తి: కేసీఆర్‌

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరారు. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి. నాకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరం అనేక ఏళ్లు కలిసి పని చేశాం.

విజయగర్జనకు పార్టీ శ్రేణులు కదలిరావాలి: కేటీఆర్‌

4. కెప్టెన్‌ వ్యూహమేంటీ..? అమిత్‌ షాతో మరోసారి భేటీ ఎందుకు?

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ ఆ పార్టీ నుంచి వైదొలిగిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తదుపరి కార్యాచరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన భాజపాలో చేరుతారని తొలుత వార్తలు రాగా.. వాటిని కెప్టెన్‌ ఖండించారు. దీంతో సొంత పార్టీ పెడతారనే ప్రచారం జోరందుకుంది.

5. శిఖర్‌ ధావన్‌పై కోహ్లీ ఫన్నీ వీడియో.. చూశారా!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ను ఆటపట్టించాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్టుచేశాడు. ధావన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుకరిస్తూ వీడియో తీసిన కోహ్లీ దాన్ని అభిమానులతో పంచుకొని నవ్వులు పూయించాడు. ప్రస్తుతం జట్టులో ధావన్‌ తన స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్‌ స్టైల్‌ ఎలా ఉంటుందో చూపిస్తూ సరదాగా నవ్వులు పూయించేందుకు ఇలా చేసినట్లు కోహ్లీ చెప్పాడు.

మలింగ రికార్డునే బద్దలు కొట్టిన షకిబ్‌ అల్‌ హసన్

6. రైతన్నల ‘రైల్‌రోకో’.. 160 రైళ్లకు అంతరాయం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాకాండపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నేడు రైతులు ‘రైల్‌రోకో’ చేపట్టారు. అన్నదాతలు పట్టాలపైకి చేరి నిరసనలు తెలియజేశారు. దీంతో దేశవ్యాప్తంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

7. ఈ రెండేళ్లు విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్‌రాజ్

‘మా’లో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించడం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేశానని మరోసారి నటుడు ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల్లో ఓడినప్పటికీ తాను ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. అనంతరం ‘మా’ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

8. మార్కెట్లోకి టాటా పంచ్‌.. ధర ఎంతో తెలుసా..?

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ ‘పంచ్‌’ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.5.49లక్షలుగా నిర్ణయించారు.  ఇక అత్యున్నత శ్రేణి క్రియేటివ్‌ ఏఎంటీ ట్రిమ్‌ ధర రూ.9.09లక్షలుగా ఉంది. సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఈ ఆఫర్‌ ధరలు కేవలం డిసెంబర్‌ 31వరకు అమల్లో ఉంటాయి. 2022 జనవరి నుంచి ధరల్లో మార్పులుంటాయని కంపెనీ పేర్కొంది. 

కొనసాగిన లాభాల జోరు.. సరికొత్త శిఖరాలకు సూచీలు!

9.వేర్వేరు డోసులతో తగ్గుతోన్న ఇన్‌ఫెక్షన్‌ ముప్పు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి పనితీరుపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న రెండు డోసుల వ్యాక్సిన్‌లను కలిపి తీసుకోవడంపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు డోసుల్లో ఒకే రకమైన టీకా తీసుకోవడంతో పోలిస్తే మిక్స్‌డ్‌ విధానంలో వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

బస్సుంది... డ్రైవర్‌ లేడు..

10. ఉద్దీపనల ఉపసంహరణకు తొందరేమీ లేదు: సీతారామన్‌

కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రకటించిన పలు ఉద్దీపన పథకాలను ఉపసంహరించేందుకు తొందరేమీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అంటే మరికొంత కాలం ఉపశమన చర్యలు కొనసాగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని