కొండ కోనల్లోంచి.. ఆసుపత్రికి చేర్చి

తాజా వార్తలు

Published : 13/08/2020 02:19 IST

కొండ కోనల్లోంచి.. ఆసుపత్రికి చేర్చి

పాడేరు: విశాఖ మన్యంలో కొండలు, కోనలకు లెక్కే లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వేలాది అడుగుల కొండలపై నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందికి దిగి రావాల్సిందే. ఇక అలాంటి చోటు నుంచి గర్భిణులను ఆసుపత్రులకు తీసుకువెళ్లడమంటే ఎంతో కష్టం. అందుకోసం అడవి బిడ్డలు అతి పెద్ద సాహసం చేయక తప్పదు. పాడేరు మండలం దేవాపురం పంచాయతీ కూడా అలాంటిదే. అత్యంత ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఆ పరిధిలోని హనుమంతపురంలో నివాసం ఉండే ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి పోరాటం ప్రారంభించారు. డోలీ కట్టి గర్భిణిని మోసుకుంటూ కొండ మార్గాన సాహసోపేతంగా అడుగులు వేశారు. ఏ మాత్రం అడుగు తడబడినా ప్రాణగండం తప్పదనేలా ఉన్న చిత్తడి కొండలపై అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగారు. అలా కొన్ని కిలోమీటర్ల మేర పయనించి దూరాన ఉన్న మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
గిరిజన గూడేల నుంచి డోలీ కట్టి గర్భిణులను తరలించడం నిత్యకృత్యమే. కానీ హనుమంతపురం లాంటి చోటి నుంచి వెళ్లడం మాత్రం ఒకరకంగా పర్వతం మీది నుంచి దిగినట్లే. అతిపెద్ద చెట్లు, ఎటు చూసినా గుబురు పొదలు, పెద్దపెద్ద బండరాళ్లతో ప్రమాదకరంగా ఉండే కొండలపై నుంచి కిందికి రావాలంటే కాసేపటికే కాళ్లు పట్టేస్తాయి. అంత కష్టతరమైన ప్రాంతం నుంచి గర్భిణిని మోసుకెళ్లడం అంటే అంతకు మించిన సాహసం మరొకటి ఉండదేమో. అయినా పట్టు సడకలకుండా అకుంఠిత దీక్షతో మాడుగుల చేరుకున్న గిరిపుత్రులు నిజంగా సాహస వీరులే. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏ సమావేశం జరిగినా మంత్రులు, ప్రజాప్రతినిధుల నోట కచ్చితంగా వినపడే మాట డోలీ కష్టాలే. ఏళ్లుగా ఆడబిడ్డలు పడుతున్న ఈ కష్టాలను కడతేరుస్తామని హామీలిచ్చే నేతలు.. తరువాత మరచిపోతూనే ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా గిరిజనం బతుకు పోరాటం సాగిస్తూనే ఉన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని