Covid Vaccine: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపనమ్మకానికి కారణాలివీ!

తాజా వార్తలు

Published : 07/08/2021 01:34 IST

Covid Vaccine: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపనమ్మకానికి కారణాలివీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొదట్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే జనాల్లో ఆందోళన, అపనమ్మకం చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పటికీ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల వారేకాకుండా.. కొద్దిమంది చదువుకున్నవారు సైతం కొవిడ్‌ వ్యాక్సిన్లపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల ఎక్కువగా నష్టం ఉండదని, దాని గురించే ఊరకనే పెద్దఎత్తున ప్రచారం జరుగుతోందని కొంతమంది అంటుంటారు. అయితే కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌పై, టీకాలపై మొదట్లో ఉన్నంత అపనమ్మకం ఇప్పుడు లేదు. కానీ ఇప్పటికీ కొద్దిమంది సందేహజీవులు తాము అనుమాన పడటమేగాక, ఇతరుల్లోనూ ఆ బీజాలను నాటుతుంటారు. ఈ అపనమ్మకానికి కారణాలేమిటో చూద్దాం!

కొవిడ్‌ అంటే భయం లేకపోవడం

వ్యాక్సిన్ల కోసం మెజారిటీ ప్రజలు ఆత్రుతగా చూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ గురించి పట్టించుకోవట్లేదు. కొవిడ్‌ తమనేమీ చేయదని వారి నమ్మకం. కంటికి కనిపించని సాధారణ వైరస్‌ మనుషులను ఎలా చంపగలదంటారు. మరికొందరు ఏ వైరస్‌ కూడా మనిషిని చంపదని ఎక్కడో చదివానని చెబుతుంటారు. ఒకరిది మూర్ఖత్వం కాగా.. మరొకరిది మిడిమిడి జ్ఞానం. కొవిడ్‌ సోకినప్పుడు ఆందోళనకు గురవ్వకుండా ధైర్యంగా ఎదుర్కోవాలేగానీ.. తమకేమీ కాదనే నిర్లక్ష్యంతో వ్యవహరించకూడదు. ఎంతోమంది యువకులు కొవిడ్‌ సెంకడ్‌ వేవ్‌లో మనదేశంలో ప్రాణాలు కోల్పోవడం, ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. కాబట్టి అలాంటివి జరగకూడదనుకుంటే వ్యాక్సిన్లను తప్పకుండా తీసుకోవాలి.

వ్యాక్సిన్‌ తయారీపై సందేహాలు

ఏ వ్యాక్సిన్‌ను తయారు చేయాలన్నా కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంటే, హడావిడిగా ఏడాదిలోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసి జనాల మీదకి వదిలారని కొందరు భావిస్తుంటారు. కొవిడ్‌-19 వైరస్‌పై ప్రపంచంలోని వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు కలసికట్టుగా, ఎంతో శ్రమించి, ఎప్పుడూ లేనంత వేగంగా వ్యాక్సిన్‌ తీసుకొచ్చారు. అవసరం దృష్ట్యా కొంచెం ముందుగానే పంపిణీ చేయాల్సి వచ్చింది. దీనికి తోడు గతంతో పోలిస్తే వ్యాక్సిన్ల అభివృద్ధిలో శాస్త్రజ్ఞానం ఎంతో మెరుగుపడింది. అంతేతప్ప నిర్లక్ష్యమేమీ లేదు.

వ్యాక్సిన్‌ వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా..

కొంతమందిలో వ్యాక్సిన్ల వల్ల రక్తం గడ్డకట్టడంలాంటి రియాక్షన్స్‌ కనిపించడం, మరణాలు సంభవించాయని సామాజిక మాధ్యమాల్లో చదవడం వల్ల కొందరు భయపడ్డారు. వ్యాక్సిన్‌ వల్ల వచ్చే జ్వరంగానీ ఇతర లక్షణాలు గానీ చాలా పరిమిత స్థాయిలో శరీర రక్షణ వ్యవస్థ చూపించే ప్రతిస్పందనే. కాబట్టి ఇదేమంత పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదు. ఇతరత్రా సమస్యలు, తమ ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నవాళ్లు వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్‌ పొందవచ్చు.

కొవిడ్‌-19కు ముందూ వ్యాక్సిన్లపై సందేహాలే!

‘‘కొవిడ్‌-19 విస్ఫోటం కంటే ముందు నుంచే వ్యాక్సిన్లపై ప్రపంచవ్యాప్తంగా సందేహాలు ఉన్నాయి. దానివల్ల ప్రపంచ ఆరోగ్య సంరక్షణపై ఇది ప్రభావం చూపిస్తోంది. కానీ కేవలం అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే దీని గురించి అధ్యయనాలు ఉన్నాయి’’ అని లాంకాస్టర్‌ యూనివర్సిటీ ఆచార్యులు జీన్‌ ఫ్రాంకోయిస్‌ మేస్టాట్‌ అంటారు. ‘‘ఆఫ్రికన్‌ దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను తగినంతగా అందించడంలో సమస్యలు ఉన్నాయి. ఒకవేళ వ్యాక్సిన్లు లభ్యమైనా, అందరూ వాటిని తీసుకునేలా ప్రజలకు నచ్చజెప్పాల్సిన అవసరం చాలా ఉంది’’ అని అంటారాయన. బ్రిటన్‌, ఇతర యూరోపియన్‌ దేశాల్లో దాదాపు 10 శాతం వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సుముఖంగా లేరని ఇటీవల ఇంగ్లాండులో జరిగిన అధ్యయనం వెల్లడించింది.  

విద్య, వైద్యం, జీవన ప్రమాణాల్లో వెనుకబడిన ఆఫ్రికా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వ్యాక్సిన్లపై జనాభాలో కొద్దిశాతం ప్రతికూలత ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సానుకూల ప్రచారం, ప్రోత్సాహకాలతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లను తీసుకునేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కొవిడ్‌ మహమ్మారి నుంచి మానవాళి తొందరగా బయటపడగలదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని