ముంబయిలో ఐసీయూ పడకలు ఫుల్‌!
close

తాజా వార్తలు

Updated : 29/05/2020 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయిలో ఐసీయూ పడకలు ఫుల్‌!

99శాతం ఐసీయూ, 72శాతం వెంటిలేటర్ల వినియోగం..

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. భారత్‌లో గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 7,466పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. భారత్‌లో సంభవించిన కొవిడ్‌ మరణాల్లో దాదాపు 42శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో 24గంటల్లో 2598 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 59,546కి చేరింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 85మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య 1982కి చేరింది. ముంబయి మహానగరంలో వైరస్‌ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీంతో నగరంలో ఇప్పటికే 99శాతం ఐసీయూ పడకలు రోగులతో నిండిపోయాయని ముంబయి కార్పొరేషన్‌ ప్రకటించింది. అంతేకాకుండా 72శాతం వెంటిలేటర్లు కూడా రోగులకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. కొవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులు కూడా 96శాతం రోగులతో నిండిపోయినట్లు బీఎంసీ వెల్లడించింది.

తమిళనాడులో 20వేలకు చేరువలో..
మహారాష్ట్ర అనంతరం వైరస్‌ తీవ్రత తమిళనాడులో కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 827 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,372కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 145మంది మృత్యువాతపడ్డారు. 

దిల్లీలో ఒక్కరోజే 1024 కేసులు..
దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. గడచిన 24గంటల్లో దిల్లీలో 1024 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 16,281కి చేరగా వీరిలో 316మంది ప్రాణాలు కోల్పోయారు.

కలవరపెడుతున్న మరణాలు..
ఇక గుజరాత్‌లోనూ కొవిడ్‌ మరణాలు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 960మంది ఈ వైరస్ సోకి మరణించారు. దేశంలో మహారాష్ట్ర అనంతరం కొవిడ్‌ మరణాలు ఎక్కువగా గుజరాత్‌లోనే సంభవిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 321మంది కరోనా రోగులు చనిపోగా, పశ్చిమ బెంగాల్‌లో 295మంది మృత్యువాతపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని