ఒక్క ఫోన్‌ కాల్‌ 16 మంది ప్రాణాలు కాపాడేది...
close

తాజా వార్తలు

Published : 10/05/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క ఫోన్‌ కాల్‌ 16 మంది ప్రాణాలు కాపాడేది...

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

భోపాల్‌: ఔరంగాబాద్‌ రైలు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన  16 మంది వలస కార్మికులు మృతిచెందిన సంఘటన రాష్ట్రాల మధ్య సమన్వయ లోపానికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మహారాష్ట్ర జల్నాలోని ఓ కార్మాగారంలో పనిచేస్తున్న వలస కార్మికులు కొందరు గురువారం రాత్రి ఏడు గంటలకు తమ స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యంలో ఔరంగాబాద్‌ సమీపంలో రైలుపట్టాలపై విశ్రాంతి తీసుకుంటున్న వీరిపై నుంచి గూడ్సురైలు దూసుకెళ్లటంతో మరణించిన సంగతి తెలిసిందే. 

ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను వెనక్కి తెచ్చే చర్యల పర్యవేక్షణకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారులను నియమించింది. కాగా మహారాష్ట్రకు సంబంధించి గిరిజన వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దీపాలీ రస్తోగీ విధుల్లో ఉన్నారు. అయితే సంబంధిత అధికారులు ఎవరూ కార్మికులకు అందుబాటులో లేరని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అధికారులు కనీసం ఫోన్‌ ద్వారా అయినా అందుబాటులో ఉండి ఉంటే ఈ దుర్ఘటన జరగకుండా ఉండేదని వారు విమర్శించారు.

‘‘మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వలస కార్మికుల వివరాలను నమోదు చేసిందా? నమోదు చేసినట్లయితే, వారిని సొంత రాష్ట్రానికి వెనక్కి తెచ్చేందుకు ఏ ప్రయత్నాలు చేశారు? ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ విషయంలో సిగ్గుపడాలి. జరిగిన ఘటనకు ఆయన బాధ్యత వహించాలి. మీడియా ముందు ప్రకటనలు ఇవ్వటానికి బదులుగా... ఇకనైనా గట్టి చర్యలకు పూనుకోవాలి. ఈ దుర్ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలి.’’ అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. 

కాగా, తాము దరఖాస్తు చేసి వారం దాటినా పాస్‌లు జారీ కాలేదు సరికదా కనీసం స్పందించలేదంటూ క్షతగాత్రుల్లో ఒకరు వాపోయారు. స్వగ్రామంలో వ్యవసాయ పనులు లేకపోవటంతో అక్కడికి వెళ్లిన తన కుమారుడు అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యాడని మృతుడు రాజ్‌ బోర్హామ్‌ తండ్రి విలపించారు. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని