దిల్లీలో పెరగనున్న టెస్టింగ్‌: అమిత్‌ షా
close

తాజా వార్తలు

Updated : 14/06/2020 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో పెరగనున్న టెస్టింగ్‌: అమిత్‌ షా

500 రైల్వే బోగీల్లో 8 వేల పడకలు అందుబాటులోకి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. దిల్లీలో ఈ మహమ్మారి వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్ బైజల్‌తో పాటు పలువురు అన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీ ఆసుపత్రుల్లో ఏర్పడ్డ పడకల కొరత దృష్ట్యా తక్షణమే 500రైల్వే ఐసోలేషన్‌ బోగీలను కేటాయిస్తున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు. తద్వారా కరోనా రోగులకు అందించే అన్ని వైద్య సదుపాయాలతో కూడిన 8వేల అదనపు పడకలు అందుబాటులోకి రానున్నాయని అమిత్‌ షా తెలిపారు. వీటితోపాటు అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తామని దిల్లీ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. కరోనా వైరస్‌ పోరులో దిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని అమిత్‌ షా పేర్కొన్నారు.

దిల్లీలో కరోనా వైరస్‌ని నియంత్రించడంలో భాగంగా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో చేపడతామని హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాబోయే రెండురోజుల్లో నిర్ధారణ పరీక్షలు రెట్టింపు చేస్తామని, మరో ఆరు రోజుల్లో వీటిని మూడింతలకు పెంచుతామని తెలియజేశారు. దీనికోసం భారీగా ర్యాండమ్‌ టెస్టింగ్‌ కిట్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మరికొన్ని రోజుల్లోనే కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అమిత్‌ షా వెల్లడించారు. ఈ సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రితో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, కొవిడ్‌ పోరులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, ఆదివారం నాటికి దిల్లీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 39వేలకు చేరగా వీరిలో ఇప్పటివరకు 1271మంది మృత్యువాతపడ్డారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని