ఏపీలో పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌
close

తాజా వార్తలు

Updated : 11/06/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌

ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్‌ చేయూత పథకానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 12న పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం నిధులపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించారు. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టును నిర్మించాలని.. కేంద్రం నిధుల కోసం ప్రయత్నిస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని సీఎం జగన్‌ చెప్పారు. మొదటి దశలో రూ.4,736 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు సీఎం వివరించారు. ఆగస్టు నాటికి పోర్టు నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అనంతరం మంత్రి పేర్ని నాని మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ‘‘నవరత్నాల్లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 45 నుంచి 60 ఏళ్లు గల ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 ఆర్థిక సాయాన్ని అందిస్తాం. ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు లబ్ధిచేకూరుతుంది. గర్భిణీలు, చిన్నపిల్లల కోసం వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల నిర్వహణకు గాను రూ. 18 వేల కోట్లకు పైగా ఖర్చుకు ఆమోదం తెలిపాం. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో రూ.153 కోట్లతో విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలోని పేదలు ఉన్నత చదువులు చదివేందుకుగాను జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అందిస్తాం. ఏడాదికి 4 విడతల్లో తల్లుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రూ. 5 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీని స్థాపించాలని సీఎం సూచించారు’’ అని మంత్రి వివరించారు.

10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు

రాష్ట్రంలోని రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉచిత విద్యుత్‌ కోసం రూ. 8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వ్యయం అవుతుంది. ఇందుకుగానూ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. ఇందుకోసం ఆర్‌ అండ్‌ ఆర్‌, భూసేకరణకు నిధులు వెచ్చించాలని నిర్ణయించాం. గండికోట రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేర నింపేందుకు ప్రణాళిక రూపొందించాం. మంత్రి మండలి ఆమోదంతో రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీల నిల్వ కోసం రూ. 500 కోట్లకు పైగా వెచ్చించనున్నాం. నీటిపారుదల ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ. 2,200 కోట్లను ప్రభుత్వం ఆదా చేసింది’’ అని మంత్రి తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని