ప్రతి పీహెచ్‌సీకి ఓ బైక్‌:సీఎం జగన్‌
close

తాజా వార్తలు

Updated : 14/05/2020 21:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి పీహెచ్‌సీకి ఓ బైక్‌:సీఎం జగన్‌

అమరావతి: స్వరాష్ట్రాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి భోజనం, మంచి నీరు సహా సదుపాయాలు కల్పించి వారి సొంత ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు.

కరోనా వ్యాప్తి నివారణపై జరిగిన చర్చలో భాగంగా అధికారులు పలు వివరాలు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 290 క్లస్టర్లు ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వాటిలో 75 క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కరోనా కేసులేవీ నమోదు కాలేదని వివరించారు. గడిచిన 14 రోజుల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాని 90 క్లస్టర్లలో మే 31 వరకు కూడా కేసులు నమోదు కాకపోతే అక్కడ కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేసుల సంఖ్య, వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్ల మేర కంటెయిన్‌మెంట్‌ ప్రాంతం, 500 మీటర్ల బఫర్‌ ప్రాంతాన్ని కలుపుకొని 1 కి.మీ పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజా రవాణా, విద్యా సంస్థలు సహా సినిమా థియేటర్లలో కార్యకలాపాలు నడిపేందుకు తీసుకోవాల్సిన విధివిధానాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అవగాహలేమితో నడుచుకుంటూ వెళ్తున్నారు..
ఒడిశా, ఝార్ఖండ్, బిహార్‌ లాంటి రాష్ట్రాలకు చెందిన కూలీలు చాలా మంది అవగాహన లేకపోవడంతో శ్రామిక్‌ రైళ్ల కోసం నిరీక్షించకుండా నడుచుకుంటూ వారి స్వరాష్ట్రాలకు వెళ్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వ్యవస్థీకృతంగా ఉంటే ఆయా రాష్ట్రాలతో మాట్లాడి పంపించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. చెక్‌పోస్టుల వద్ద వారిని గుర్తించి పక్కనే ఉన్న సహాయ కేంద్రాలకు పంపించే ప్రయత్నం చేసినప్పటికీ వారు నడుచుకుంటూ వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు చెప్పారు. ఇలాంటి వారిని వారి స్వస్థలాలకు తరలించడంపై ఆలోచన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఒకే రోజు ప్రారంభిస్తాం..
రాష్ట్రంలో టెలీ మెడిసిన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి పీహెచ్‌సీకి ఓ బైక్‌ను జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 1,060.. 108, 104 అంబులెన్స్‌ వాహనాలు ప్రారంభిస్తున్నందున వీటితోపాటు బైక్‌ సర్వీసులు కూడా ప్రారంభించాలన్నారు. టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు డోర్‌డెలివరీ చేయడానికే బైక్‌లను వినియోగించాలని సూచించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని