విమానాల్లో మిడిల్ సీటుకు పచ్చజెండా..
close

తాజా వార్తలు

Published : 15/06/2020 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమానాల్లో మిడిల్ సీటుకు పచ్చజెండా..

ముంబయి: లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత విమానాలు సర్వీసులు తిరిగి ప్రారంభమైనా సాధారణ స్థాయి కంటే తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. అందులోనూ విమానాల్లో మధ్య సీట్లు ఖాళీగా ఉంచాలన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలపై కొంత కాలంగా అనిశ్చితి కొనసాగుతుంది. తాజాగా దీనికి తెర దించుతూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. విమానయాన సంస్థలు మధ్య సీట్లను కూడా ప్రయాణికులకు కేటాయించేందుకు అనుమతించింది. అయితే కరోనా వ్యాపించకుండా డీజీసీఏ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.  

కొద్ది రోజుల క్రితం విమానాల్లో మధ్య సీట్లు ప్రయాణికులకు కేటాయించడంపై అభ్యంతరం తెలుపుతూ ఎయిరిండియా పైలట్‌ ఒకరు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రయాణికులకు మధ్య సీట్లు కేటాయించవద్దని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా వందే భారత్ మిషన్‌ విమానాలకు జూన్‌ 6 వరకు అనుమతిచ్చింది. తాజాగా ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు పౌర విమానయాన శాఖ సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకుని మధ్య సీటు భర్తీ చేసుకోవచ్చని తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. మధ్య సీటు ఖాళీగా ఉంచినప్పటికీ విండో సీట్లో ఉన్న ప్రయాణికుడు మధ్యలో టాయిలెట్ లేదా ఇతర అవసరాల కోసం లేచి వరుసలో చివర కూర్చున్న ప్రయాణికుడిని దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వారు ఒకరికొకరు కాంటాక్ట్ అవుతారు. అలాంటప్పుడు మధ్య సీటు ఖాళీగా ఉంచడంలో ఉపయోగంలేదు. దానికి బదులు ప్రయాణికులకు సీటు కేటాయిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని కోర్టు వ్యాఖ్యానించింది.  

డీజీసీఏ మే 31న విడుదల చేసిన మార్గదర్శకాల్లో విమానయాన సంస్థలు మధ్య సీట్లు ఖాళీగా ఉంచాలని పేర్కొంది. ఒక వేళ ఆ సీటును ప్రయాణికులు బుక్‌ చేసుకుంటే వారికి తప్పనిసరిగా పీపీఈ కిట్, మాస్క్‌, ఫేస్‌ షీల్డ్  అందించాలని సూచించింది. అలానే ఒకే కుటుంబానికి చెందిన వారు బుక్‌ చేసుకుంటే ఆ సీటు కేటాయించవచ్చని సూచించింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని