కరోనా..జ్వరం, ఫ్లూలాంటిదే: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 01/04/2020 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా..జ్వరం, ఫ్లూలాంటిదే: జగన్‌

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఈ వైరస్‌తో ఆందోళన వద్దని.. ఇది జ్వరం, ఫ్లూ లాంటిదే అని ఆయన చెప్పారు. జ్వరం వస్తే నయమైనట్లే ఇది నయమవుతుందన్నారు. వయసు పైబడిన వాళ్లతో పాటు కిడ్నీ, బీపీ, షుగర్‌లాంటి వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ సోకితే దయచేసి పాపంగానో, తప్పుగానో చూడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడారు.

70 కేసులు అక్కడి నుంచి వచ్చిన వాళ్లే..

‘‘దిల్లీ వెళ్లొచ్చిన వారి వల్ల అనేక మందికి కరోనా వైరస్‌ సోకింది. రాష్ట్రంలో 87 కేసులు రాష్ట్రంలో నమోదైతే..70 కేసుల్లో దిల్లీలో మర్కజ్‌లో పాల్గొన్నవారే ఉన్నారు.  మన రాష్ట్రం నుంచి దాదాపు 1085 మంది ఆ సమావేశానికి వెళ్లారు. అందులో 585 మందికి పరీక్షలు నిర్వహించాం. 70 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. మరో 500 కేసులు పరీక్షలకు పంపాం.. నివేదికలు రావాల్సి ఉంది. దిల్లీ వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారినీ గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరికి బాగోలేకపోయినా స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి. గ్రామవాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఎవరొచ్చినా వారికి చెప్పండి. అలాంటి వారికి సంబంధిత పరీక్షలు చేయడమే కాకుండా నయం కావడానికి అవసరమైన మందులు ఇస్తారు. రోజూ వచ్చి పరిశీలించి వెళ్తారు. ఆరోగ్యం విషమిస్తే నేరుగా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు.. ఇలా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా 104కు ఫోన్‌ చేసి చెప్పాలి. ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం వద్దు. దీంతో మీ కుటుంబసభ్యులతో పాటు పొరుగువారికి కూడా మేలు జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయమైన పరిస్థితి ఉంది. ఎలాంటి భయాందోళన అవసరం లేదు’’ అని సీఎం సూచించారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు..

ఈ సంక్షోభ సమయంలో సేవలు అందించాలని ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందిని సీఎం జగన్‌ కోరారు. కరోనా నివారణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాలు ప్రైవేట్‌ ఆస్పత్రుల సహకారాన్ని కోరాయని.. ఎక్కడైనా అలా జరగని పరిస్థితి ఉంటే 104కు ఫోన్‌ చేసి నమోదు చేసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా మందగించే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉండటంతో వారికి మరింత చేయూత అందివ్వాలనే ఉద్దేశం నేపథ్యంలో అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుకోని భారం పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో తమ వేతనాల వాయిదాకు అంగీకరించిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పెన్షనర్లు, ఒప్పంద ఉద్యోగులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయం  చేసుకునే రైతులు, రైతులు కూలీలు, ఆక్వా రైతులు ఒంటిగంట వరకు తమ పనులు చేసుకోవచ్చని.. అయితే భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా సోకిన వారిపట్ల మానవత్వం చూపాలని.. వివక్ష, చిన్నచూపు వద్దని జగన్‌ సూచించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని