కిట్లు ఆర్డర్‌ ఇచ్చినపుడే షరతు పెట్టాం:జగన్‌
close

తాజా వార్తలు

Updated : 20/04/2020 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిట్లు ఆర్డర్‌ ఇచ్చినపుడే షరతు పెట్టాం:జగన్‌

అమరావతి: ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల వ్యవహారంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న వేళ సీఎం జగన్‌ స్పందించారు. ఆ కిట్లు ఎక్కడున్నా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని స్పష్టం చేశారు. కరోనా నివారణపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. ఐసీఎంఆర్ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) అనుమతిచ్చిన సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిందని చెప్పారు. ఒక్కో కిట్‌ను రూ.795కు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్‌ పేర్కొందని.. అయినా రూ.65 తక్కువకు ఏపీ ప్రభుత్వం ఆర్డర్‌ ప్లేస్‌ చేసిందని వివరించారు. 

ఒకవేళ తక్కువ ఖర్చుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే ఆ ధర ప్రకారమే చెల్లిస్తామని సదరు ఆర్డర్‌లోనే షరతు పెట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చినపుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయని చెప్పారు. అదే సంస్థ నుంచి తయారీకి మనదేశంలో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చాక కిట్ల ధర తగ్గిందన్నారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే చెల్లింపులు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతు వల్ల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల ధర తగ్గించేందుకు తయారీ సంస్థ అంగీకరించిందన్నారు. చాలా నిజాయతీగా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఆర్డర్‌ చేశామని.. ప్రజాధనాన్ని కాపాడే ఆలోచన చేసిన వైద్యఆరోగ్యశాఖ అధికారులను అభినందిస్తున్నట్లు సీఎం చెప్పారు. 

ర్యాపిడ్‌ కిట్లను రూ.337కే కొనుగోలు చేస్తున్నామంటూ ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య‌ మంత్రి టి.ఎస్‌.సింగ్‌దేవ్ ఇటీవల ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. 

ఛత్తీస్‌గఢ్‌ కంటే రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరకు ర్యాపిడ్‌ కిట్లు కొనుగోలు చేస్తోందని ఆరోపించాయి. కరోనా కిట్లలో కూడా కమీషన్‌ కొట్టారా? అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కిట్ల ధర ఎంతో ప్రజలకు చెప్పి పారదర్శకత నిరూపించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని