close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/05/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా పనిచేశాం:జగన్‌

అమరావతి:  కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా పనిచేయగలిగామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.  కొవిడ్‌ పరీక్షల పరంగా చూస్తే దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని.. ప్రతి 10లక్షల జనాభాకు 2500కి పైగా పరీక్షలు చేస్తున్నామని, ఇది ఒక రికార్డు అని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలతో పాటు ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు, గృహనిర్మాణం, ఉపాధి హామీ అంశాలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు.  కరోనా నియంత్రణ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పనితీరు కనబరిచారని సీఎం అభినందించారు.

 35రోజుల క్రితం రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్‌ తప్ప మరెక్కడా కరోనా పరీక్షలు చేసే సౌకర్యం లేదని.. అక్కడ కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని జగన్‌ గుర్తు చేశారు.  ప్రస్తుతం 11 జిల్లాల్లో పరీక్షలు చేసే ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ట్రూనాట్‌ కిట్లు సైతం అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని వివరించారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్‌ ఉందన్నారు. కరోనాను ఎంత కట్టడి చేయాలనుకుంటున్నా.. అది ఎక్కడో ఓ చోట కనిపిస్తోందన్నారు.  కరోనా జీవితంలో భాగమని.. దానితో కలిసి జీవించాల్సి ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. కరోనా మరణాల రేటు కేవలం 2 శాతంలోపే ఉందన్నారు. వయసు పైబడిన వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఇది ప్రభావం చూపుతోందని చెప్పారు.

కనీసం లక్ష మందికి క్వారంటైన్‌ సదుపాయం కల్పించాలి

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలప కార్మికులు ఏపీకి తిరిగి వస్తున్నారని.. వాళ్లకు క్వారంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు. లక్షకు పైగా వలస కూలీలు, మరో లక్ష మంది ఇతరులు కూడా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. వివిధ దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చెందిన వారు వస్తున్నారని.. అందుకే స్థిరంగా ప్రభుత్వం తరఫున కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. దాదాపు 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో కనీసం లక్ష మందికి క్వారంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. ఆయా కేంద్రాల్లో సదుపాయాలపై రోజూ సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.  పీహెచ్‌సీ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్‌ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలని జగన్‌  సూచించారు. 24 గంటల్లోపు ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం మందులు సరఫరా చేయాలన్నారు. త్వరలో విలేజ్‌ క్లినిక్‌ ప్రారంభమవుతుందని.. అప్పుడు టెలీ మెడిసిన్‌ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈ వ్యవస్థను కలెక్టర్లు తమది భావించి బాగా పనిచేయాలన్నారు.  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించుకున్న కంటైన్‌మెంట్‌ క్లస్టర్లపై దృష్టి పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అనంతరం  ఖరీఫ్‌ సీజన్‌ వ్యవసాయంపై జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఆర్బీకేలకు సలహాల కోసం అడ్వైజరీ బోర్డులు

జూన్‌ 1 నుంచి రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ప్రారంభమవుతాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈలోపు మండల, జిల్లా స్థాయి అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ అడ్వైజరీ బోర్డులు సలహాలు, సూచనలు చేస్తాయన్నారు. ఏ పంట వేయాలి? ఏ పంటలు వేస్తే మంచి ధర వస్తుంది? అనే విషయాలపై ఆయా బోర్డులు తమ సలహాలు ఇస్తాయని సీఎం చెప్పారు. ఈ సూచనల మీద రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అవి అమలయ్యేలా ఆర్బీకేలు చర్యలు చేపడతాయన్నారు. మనిషికి గుండె ఎలాంటిదో వ్యవసాయ రంగానికి ఆర్బీకేలు కూడా అలానే పనిచేయాలని సూచించారు.  రాబోయే రోజుల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల బాధ్యతలు కూడా ఆర్బీకేలే తీసుకుంటాయన్నారు. వాటిని ముందుండి నడిపించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. మరో ఏడాదిలోపు జనతా బజార్లు వస్తాయని సీఎం వివరించారు.

రైతులకు అక్టోబరు నాటికి డెబిట్‌ కార్డులు 

ప్రభుత్వం అందించే నగదు రైతులకు చేరేందుకు డెబిట్‌ కార్డులు ఇస్తామని.. వచ్చే అక్టోబరు నాటికి వారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జగన్‌ స్పష్టం చేశారు. రైతులు ఆ కార్డుతో డబ్బైనా తీసుకోవచ్చని.. లేదంటే దాని ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు క్రెడిట్‌ కార్డులు కూడా ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. రైతు పంట వేసిన తర్వాత పంట రుణం రాలేదన్న మాట వినకూడదనే ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఇ-క్రాపింగ్‌ చేస్తారని చెప్పారు. దీని ఆధారంగా బ్యాంకు కచ్చితంగా రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. ఆ రుణంపై వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద జీరో వడ్డీ వర్తిస్తుందని సీఎం వివరించారు. ప్రస్తుతం ఏపీపై తుపాను ప్రభావం లేకపోవచ్చని ఐఎండీ చెబుతోందన్నారు. కాకపోతే అకాల వర్షాలు కురిసే అవకాశముందని.. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్లకు జగన్‌ సూచించారు.

జిల్లాకు ముగ్గురు జేసీలు

ప్రతి జిల్లాకూ ముగ్గురు జేసీలను పెడుతూ ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. ఎవరెవరూ ఏం చేయాలనేదానిపై విధివిధానాలు రూపొందిస్తామన్నారు. ఒక జేసీకి పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధానాంశమైన నాడు-నేడు, ఆస్పత్రులు, స్కూళ్ల అభివృద్ధి బాధ్యతలు వీరికి అప్పగిస్తామన్నారు. గ్రామ సచివాలయాల్లో నిర్దేశించిన సమయంలోపు పలానా సర్వీసులు అందిస్తామని చెప్పామని.. నిర్ణీత సమయంలోపు అవి ప్రజలకు అందాలన్నారు. దరఖాస్తు చేసినా రాలేదనే మాట రాకూడదని.. ఆ బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. 

షాక్‌ కొట్టేలా మద్యం రేట్లు

మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం ధర పెంచామని సీఎం స్పష్టం చేశారు.  దుకాణాల సంఖ్య కూడా 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 43వేల బెల్టుషాపులను రద్దుచేశామని జగన్‌ వివరించారు. మద్యం అమ్మకాలను పెంచేందుకు ప్రైవేటు వ్యక్తులు బెల్టుషాపులను ప్రోత్సహించేవారని.. అందుకే లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోందని చెప్పారు. రేట్లు షాక్‌ కొట్టించేలా ఉండాలని నిశ్చయించుకున్నామన్నారు.  పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాతో పాటు రాష్ట్రంలో మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉందన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.