భయం పోతేనే పోరాడగలం: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 10/05/2020 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయం పోతేనే పోరాడగలం: జగన్‌

అమరావతి: కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేలా చూడాలని చెప్పారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ తర్వాత అనుసరించాల్సిన హెల్త్‌ప్రొటోకాల్‌పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకున్న ఏపీకి చెందినవారు రేపటి నంచి స్వదేశానికి తిరిగి వస్తారని అధికారులు సీఎంకు తెలిపారు. అమెరికా నుంచి వచ్చేవారు ముంబయి, హైదరాబాద్‌, చెన్నై విమానాశ్రయాలకు చేరుకుంటారని.. అలా వచ్చేవారందరినీ విశాఖ, తిరుపతి, విజయవాడలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వారందరికీ ఉచితంగా అన్ని వసతులూ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం వారిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్నదానిపై ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన వారు అనుమతి పొందినా.. గమ్యానికి చేరుకునేంత వరకూ వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలను ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తలు, హెల్త్‌ అసిస్టెంట్‌కు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్నవారు హోం క్వారంటైన్‌ పాటించేలా చేయడం, పరీక్షలు చేయించడం, కావాల్సిన వైద్య సదుపాయాలు, అవసరమైతే ఆస్పత్రికి తరలించడం లాంటి కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూనే భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని.. అలా చేస్తేనే వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని సీఎం అభిప్రాయపడ్డారు. వీటన్నింటికి సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ‌ఆదేశించారు.

మరణించిన కుటుంబాలకు ఇవాళే పరిహారం

విశాఖ గ్యా్‌స్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం పరిణామాలపై సీఎం జగన్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. బాధితులు కోలుకుంటున్న వైనం, చికిత్స అందుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. విషవాయువు ప్రబలిన ప్రాంతంలో గ్యాస్‌ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని.. నిపుణులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారని చెప్పారు. స్టైరీన్‌ గ్యాస్‌ అవశేషాల తొలగింపు చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లో ముమ్మరంగా శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు. అన్ని చర్యలు తీసుకున్నాకే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని ఆదేశించారు. మరణించినవారి కుటుంబాలకు ఇవాళ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రేపు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వారికి ప్రకటించిన విధంగా సహాయం అందించాలన్నారు.
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని