3వారాలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు
close

తాజా వార్తలు

Updated : 13/05/2020 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3వారాలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు

సమీక్షలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి

అమరావతి: రాష్ట్రంలో 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. టెలీమెడిసిన్‌ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో నమోదవుతోన్న కరోనా కేసులు, పరీక్షలు, నియంత్రణ చర్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 2 లక్షలు దాటిందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతి 10 లక్షలకు 3,768 పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. కొత్తగా నమోదైన 48 కేసుల్లో 36 పాత క్లస్టర్ల నుంచే వచ్చాయని చెప్పారు. పాజిటివిటీ, మరణాలు, రికవరీ రేటులో దేశం కంటే రాష్ట్రం మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రికి నివేదించారు. ఎమర్జెన్సీ సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే ఫోన్ చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారన్నారు.

అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా పెట్టిన ఆరోగ్య ఆసరా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని  అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించామని చెప్పారు. బిల్లులు అప్‌లోడ్‌ చేసి ప్రతి మూడు వారాలకోసారి మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ విధానంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో తలెత్తిన సమస్యల పరిష్కార మార్గాలపై సమీక్షించిన సీఎం.. చేపలు, రొయ్యలను రాష్ట్రంలోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండాలని.. దీనిపై ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు పండించిన ఇతర ఉత్పత్తులకు కూడా కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చేపల మార్కెటింగ్‌, ధర విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి మోపిదేవి వెంకటరమణకు సీఎం వివరించారు. రాయలసీమలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్‌ కల్పించాలని.. కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని