ఏ రాష్ట్రం అదనంగా నీటిని వాడుకోదు: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 12/05/2020 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ రాష్ట్రం అదనంగా నీటిని వాడుకోదు: జగన్‌

విజయవాడ: రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్‌ జలవనరులశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం వంటి ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేనిపరిస్థితి నెలకొంది. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కేటాయింపులు దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకోదు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటి కేటాయింపులు చేస్తుంది. పరిధి దాటి నీటిని తీసుకోవడానికి బోర్డు కూడా అంగీకరించదు’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

ఆ పది రోజుల్లోనే తరలించాలి..
‘‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానకి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు మించి ఉండటం మహా కష్టం. ఆ 10 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలంలో 854 అడుగులకు చేరితో 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే నీరు వెయ్యి క్యూసెక్కులు మాత్రమే. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్‌ నుంచి వెళ్లేది గరిష్ఠంగా 9 వేల క్యూసెక్కులే. శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే ఆమాత్రం నీళ్లైనా వెళ్తాయి. తెలంగాణవైపు ఉన్న ప్రాజెక్టులు చూస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించవచ్చు. శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో కూడా నీటిని తరలించవచ్చు. రోజుకు 2 టీఎంసీల మేర 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు’’ అని సీఎం జగన్‌ వివరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని