ఏపీలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం
close

తాజా వార్తలు

Published : 19/05/2020 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం

కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

అమరావతి: రాష్ట్రంలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభం కానున్నాయని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడించారు. ఆ సమయానికి వైఎస్‌ఆర్ విద్యా కానుకను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సాధారణ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కువ మంది వచ్చే ప్రాంతాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పారు. రెండు మూడురోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభించే ఆలోచనలు ఉన్నందున.. వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పని సరి చేయాలన్నారు. కరోనా నివారణలో కలెక్టర్లు, ఎస్పీలు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా అద్భుతంగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా చర్చించారు. గత లాక్‌డౌన్‌లో అనుసరించిన విధానాలు ఒకలా ఉంటే.. లాక్‌డౌన్‌-4లో అనుసరించాల్సిన విధానాల్లో అనేక మార్పులు ఉంటాయన్నారు. ఈ విడతలో ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని.. అందుకు కావాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నివారణపై దృష్టి కొనసాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుందన్నారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఉండబోవని స్పష్టం చేశారు. 

‘‘రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వీటి నిర్మాణాన్ని కలెక్టర్లు తమ ముఖ్యమైన విధిగా భావించాలి. కరోనా అనుమానం ఉన్న వారు అక్కడకు వెళ్లి, పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ సాఫీగా సాగిపోవాలి. ప్రజలకు టెస్టింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలి. భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం లాంటి వాటిపై ప్రజల్లో పూర్తి అవగాహన తీసుకురావాలి. ఆస్పత్రులను పూర్తిగా సన్నద్ధం చేసుకోవాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని