జులై చివరినాటికి ‘నాడు-నేడు’ పూర్తి
close

తాజా వార్తలు

Published : 03/06/2020 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జులై చివరినాటికి ‘నాడు-నేడు’ పూర్తి

విద్యాశాఖలో కార్యక్రమ అమలుపై సీఎం సమీక్ష 

అమరావతి: జులై చివరినాటికి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. విద్యాశాఖలో నాడు-నేడు అమలుపై మంత్రి సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమం మొదటి దశలో రూ. 3,700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీని కింద ఇప్పటికే అనేక చోట్ల పనులు ఊపందుకున్నాయన్నారు. తొలి దశలో 15,700 పాఠశాలల్లో మౌలిక వసతులు, 500 కొత్త కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నాడు-నేడుపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

సమీక్ష అనంతరం మౌలిక సదుపాయాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫర్నీచర్‌ నాణ్యతను సీఎం జగన్‌ పరిశీలించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేయడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని మంత్రి అన్నారు. నాడు-నేడు రెండో విడతలో రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. జగనన్న గోరుముద్ద కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సురేశ్‌ తెలిపారు

ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్‌ అనుమతిచ్చారని.. ఆయన ఆదేశాల మేరకు త్వరలోనే బదిలీలు చేపట్టనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా టీచర్ల బదిలీలు చేపడతామన్నారు. బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎవరి చుట్టూ తిరగనవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు అయిన వెంటనే బదిలీల ప్రక్రియకు చర్యలు తీసుకుంటామని వివరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని