కరోనా వ్యాక్సిన్ ఎప్పటిలోగా రానుంది?  ధరెంత? ‌ 
close

తాజా వార్తలు

Updated : 01/07/2020 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వ్యాక్సిన్ ఎప్పటిలోగా రానుంది?  ధరెంత? ‌ 

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లతో ‘ఈటీవీ’ ముఖాముఖి

ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా కొవిడ్‌ వైరస్‌ బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అడుగులు పడుతున్నాయి. మన దేశంలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా ఈ నెలలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. క్లినికల్‌ ట్రయల్స్‌, ప్రజలకు పూర్తిస్థాయిలో ఎప్పటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతుంది తదితర కీలకాంశాలపై భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి... 

ప్రశ్న: భారత్ బయోటెక్‌ నుంచి వ్యాక్సిన్‌ ఎప్పుడు మార్కెట్‌లోకి రాబోతుంది?

కృష్ణ ఎల్ల: మా సంస్థ నుంచి ఎప్పుడు వ్యాక్సిన్‌ రాబోతుందో ఇప్పుడే చెప్పలేను. క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యమైన అంశం ఏమిటంటే భారత్‌కు చెందిన సంస్థ ముందున్నదని మాత్రం గట్టిగా చెప్పగలను. వ్యాక్సిన్‌ తయారీలో కాస్త ఆలస్యమైంది. మా వల్ల మాత్రం జాప్యం జరగలేదు. విదేశాల నుంచి వైరస్‌కు చెందిన రీఏజెంట్స్ రావడం ఆలస్యం కావడంతోనే ఇలా జరిగింది. అయినా ఇప్పటికీ ముందంజలోనే ఉన్నాం. 

ప్రశ్న: ప్రపంచంలోనే మొదటిసారిగా వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ అందిస్తుందని అనుకుంటున్నారు.. మీరేం చెప్తారు? 

కృష్ణ ఎల్ల: దేశంలోని తయారీదారులు బాగా వేగంగా ఉన్నారు. టెక్నాలజీలో చైనా, కొరియా కంటే అడ్వాన్స్‌లో ఉన్నాం. తప్పనిసరిగా త్వరలోనే మనమే అందిస్తామనే నమ్మకం ఉంది. 

ప్రశ్న: క్లినికల్‌ ట్రయల్స్‌ ఎప్పుడు ఉండొచ్చు.. జులైలో మీ లక్ష్యాలేంటి? 

కృష్ణ ఎల్ల: జులై మొదటి వారంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. ఎథికల్‌ కమిటీ అనుమతి రాబోతోంది. కొవిడ్‌ రహిత వాలంటీర్లను సిద్ధం చేస్తున్నాం. క్లినికల్‌ ట్రయల్స్ జరిపేందుకు భారత్‌ బయోటెక్‌కు దేశంలో పది కేంద్రాలు ఉన్నాయి. జంతువు నుంచి జంతువుకు సోకడం వల్ల కరోనా తీవ్రత పెరిగింది. 

ప్రశ్న: మొదటి, రెండో దశ దాటిన తర్వాత మూడో స్టేజ్‌ ఎలా ఉండబోతుంది?

కృష్ణ ఎల్ల: వ్యాక్సిన్‌ తయారీకి మూడు విధానాల్లో ప్రయోగాలు చేస్తున్నాం.  మూడో స్టేజ్‌ అనేది మా చేతుల్లో లేదు. అది ప్రభుత్వం చేతుల్లో ఉంది. క్లినికల్‌ డేటా బాగుంటే మార్కెట్‌ చేసేందుకు పర్మిషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్లినికల్‌ డేటా సరిగా లేకపోతే క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో ఫేజ్‌ చేయమని అడగొచ్చు. 

ప్రశ్న: మీ అనుభవం ప్రకారం ఎప్పటిలోగా కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది? 

కృష్ణ ఎల్ల: క్లినికల్‌ పరీక్షలు మొదటి, రెండో దశ పూర్తైన తర్వాత మాత్రమే చెప్పగలం. లేకపోతే జోతిష్యం చెప్పినట్టు అవుతుంది. ఫేజ్‌ 1 అయిన తర్వాత సమాచారం అనేది తెలుసుకోగలుగుతాం. మేం తీసుకొచ్చే వ్యాక్సిన్‌ చాలా మంచిది.  ఇదే పని చేయకపోతే మాత్రం మిగతావి కూడా పని చేసే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు. 

ప్రశ్న: ఇప్పుడు తీసుకురాబోయే వ్యాక్సిన్‌ పట్ల మీ భరోసా ఏమిటి?

కృష్ణ ఎల్ల: వ్యాక్సిన్‌ల తయారీలో భారత్‌ బయోటెక్‌కు ఘన చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఆరు వ్యాక్సిన్లను తయారు చేశాం. జికా, రేబిస్‌, చికెన్‌ గున్యా వంటి వాటికి చేసిన అనుభవం ఉంది. చైనీస్‌ పబ్లిష్‌ చేసిన రెండు దశల డేటాను పరిశీలిస్తే.. బాగా పని చేసింది. ఇప్పుడు అదే బెస్ట్‌ వ్యాక్సిన్‌ అనిపిస్తోంది. అయితే దానికంటే బెటర్‌గా అడ్వాన్స్‌డ్‌గా భారత్‌ బయోటెక్‌ తయారు చేయబోతుంది. టెక్నాలజీ ప్రకారం చైనా కంటే పది అడుగులు ముందే ఉన్నామని చెప్పగలను. వైరస్‌పై ముందే చైనా ప్రకటన చేసి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు. ప్రయాణాల కారణంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందింది. 

 ప్రశ్న: ప్రభుత్వం, ఐసీఎంఆర్‌, పుణె వైరాలజీ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎలా సహకారం అందుతుంది?

కృష్ణ ఎల్ల: పుణె వైరాలజీ ల్యాబ్‌ నుంచి పూర్తి సహకారం అందుతోంది. మేం చేసిన పరీక్షలు అక్కడకు వెళ్తున్నాయి.. వారి నుంచి శాంపిల్స్‌ మాకు వస్తున్నాయి. అన్నింటినీ వెరిఫై చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అడగలేదు. ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకోలేదు. 

ప్రశ్న: రెండు మూడు నెలల్లో భారత్‌ బయోటెక్‌ లక్ష్యాలేంటి?

కృష్ణ ఎల్ల: ప్రస్తుతం మేం 16 రకాల వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాం. కరోనా వ్యాక్సిన్‌పైనే దృష్టిసారించి మిగతా వాటిని పట్టించుకోకపోతే నష్టం జరుగుతుంది. వ్యాక్సిన్‌ తయారీ అనేది చాలా సుదీర్ఘ ప్రక్రియ. వచ్చే ఏడాదికి 130 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. ఐదారు నెలల్లో కరోనాకు ఎన్నో థెరపీలు వస్తాయి. వ్యాక్సిన్‌తోపాటు థెరపీపైనా మేం దృష్టి సారించాం. 
ప్రశ్న: వ్యాక్సిన్‌ ధర ఎంత వరకు ఉండొచ్చు?

కృష్ణ ఎల్ల: వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత తాము అందించే ధరకు ఇతరులు ఇవ్వలేరని నమ్మకంగా చెబుతున్నాం. ప్రారంభంలో వ్యాక్సిన్‌ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి పెరిగే కొద్దీ ధర కూడా తగ్గిపోతుంది. మా పోటీ కరోనాతో తప్ప ఇతర సంస్థలతో కాదు. నాణ్యమైన వ్యాక్సిన్‌ను తయారు చేయడమే మా ఉద్దేశం. 

ప్రశ్న: ఇతర దేశాలతో పోలిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాం? ప్రజలకు ఏం భరోసా ఇస్తారు?  

కృష్ణ ఎల్ల: ఈ వ్యాక్సిన్‌ తయారీలో చైనా, అమెరికాలతో పోలిస్తే మూడు నెలలు వెనుకబడ్డాం. అయితే ఉత్పత్తి, మార్కెటింగ్‌లో అడ్వాన్స్‌గా ఉన్నాం కాబట్టి త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం. భారత కంపెనీలను నమ్మండి. మంచి వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. మేమంతా కష్టపడుతున్నాం. ప్రజల భద్రత, వ్యాక్సిన్‌ ప్రామాణికత.. రెండూ ముఖ్యం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని