close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/04/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. కరోనాకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్నాం

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్‌-19కి టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ‘కరోఫ్లూ’ అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించే ప్రక్రియలో తనతో పాటు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌- మాడిసన్‌ శాస్త్రవేత్తలు, టీకా కంపెనీ అయిన ఫ్లూజెన్‌ పాలు పంచుకుంటున్నట్లు, ఈ మేరకు ఒక ‘అంతర్జాతీయ భాగస్వామ్యం’ కుదిరినట్లు శుక్రవారం ఇక్కడ తెలియజేసింది. ముక్కు ద్వారా ఇచ్చేలా ‘ఇంట్రా నాసల్‌’ వ్యాక్సిన్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలుగువాళ్లు భద్రం

కరోనా ప్రభావంతో అమెరికాలో పలు రంగాలు కుదేలవుతున్నాయని, ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ తెలిపారు. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని చెప్పారు. తెలుగు వారికి సహాయం చేసేందుకు తానా ముందుంటుంది. కరోనాపై అవగాహన కోసం వెబినార్‌ ద్వారా వైద్యులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. తానా నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న వైద్యులకు చెప్పి తగిన సహాయం చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల మాస్క్‌లు పంపిణీ చేశాం. తానా సహాయం అవసరమైతే 18556878262కు ఫోన్‌ చేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. న్యూయార్క్‌లో ఖననానికీ కష్టాలే

కరోనా విజృంభణ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ వైరస్‌ బారినపడి మృత్యువాత పడ్డవారి సంఖ్య అమెరికా, స్పెయిన్‌, బ్రిటన్‌లో శుక్రవారం ఒక్కసారిగా పెరిగిపోయింది. న్యూయార్క్‌లో మృతదేహాల ఖననానికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దేశాలన్నీ సర్వశక్తులు ఒడ్డుతూ ఈ మహమ్మారిపై పోరాడుతున్నాయి. కొవిడ్‌-19 సోకిన కేసులు ప్రపంచవ్యాప్తంగా 10.68 లక్షలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 56వేలను మించిపోయింది. అయితే ఈ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా అందుబాటులోకి రాకపోవడం వల్ల వాస్తవ రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కరోనా కేసుల్లో నాలుగోవంతు.. అమెరికాలోనే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గంజి తాగి బతుకుతున్నాం

 ‘ఒక పూట తినాల్సిన తిండి.. మూడు పూటలు తింటున్నాం. అన్నం వండుకోవడానికి బియ్యం చాలవని ఒక్కో పూట గంజి తాగి బతుకుతున్నాం. పని చేసుకుందామంటే బయటకెళ్లే పరిస్థితి లేదు. చేతిలో రూపాయి లేదు. బియ్యం, సరకులు అన్నీ నిండుకున్నాయి. అర్ధాకలితో అలమటిస్తున్నాం. ఆదుకోండి’ అంటూ మహారాష్ట్రలోని మధ్‌ ద్వీపంలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మంచినీళ్లపేట, కొత్తపేట, భావనపాడు, పాత నౌపడ తదితర గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది అక్కడ చిక్కుకుపోయారు. వీరంతా వలలు అల్లే పనుల కోసం ఏటా అక్కడికి తాత్కాలికంగా వలస వెళ్లి వస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆదిత్య బిర్లా గ్రూప్‌ భూరి విరాళం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఉపశమన చర్యల నిమిత్తం ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.500 కోట్ల భూరి విరాళం ప్రకటించింది. ఇందులో కుమార మంగళం బిర్లా నేతృత్వాన రూ.400 కోట్లను ప్రధానమంత్రి సహాయ నిధి ‘పీఎం-కేర్స్‌’కు కేటాయించింది. ఫిక్కీ-ఆదిత్య బిర్లా సీఎస్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌కు రూ.50 కోట్లు; వెంటిలేటర్లు, మాస్కులు, ప్రాణ రక్షణ వస్తువుల కోసం మరో రూ.50 కోట్లు కేటాయించింది. ఆర్థిక సాయంతో పాటు నీరజ్‌ బిర్లా నేతృత్వాన... ముంబయి శివారులోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో 100 పడకలతో కొవిడ్‌-19 రోగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆదిత్య బిర్లా గ్రూపు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్మార్ట్‌ఫోన్‌లో కరోనా నిర్ధరణ పరీక్ష!

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) లక్షణాల్లో దగ్గు ప్రధానమైనది. మరి.. ఆ వైరస్‌ కారణంగానే దగ్గు వస్తోందని గుర్తించడం ఎలా..? స్మార్ట్‌ఫోన్‌లో దగ్గును రికార్డు చేసి.. వ్యాధి సోకిందో లేదో గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ డాక్టుర్నల్‌. నెల రోజుల్లో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది. ఇప్పటివరకు కొవిడ్‌-19ను గుర్తించేందుకు లక్షణాల ఆధారంగా రక్తం, కఫం (కళ్లె) నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పట్టీ రూపంలో టీకా

కరోనా వైరస్‌ను నిరోధించే ఒక టీకాను అమెరికా పరిశోధకులు రూపొందించారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించారు. ఇది వేలి ముద్ర పరిమాణంలో ఉన్న ఒక పట్టీలా ఉంటుంది. ఇది నేరుగా టీకాను ప్రవేశపెడుతుంది.  ఈ టీకాకు పిట్‌కోవాక్‌ (పిట్స్‌బర్గ్‌ కరోనావైరస్‌ వ్యాక్సిన్‌) అని పేరుపెట్టారు. దీన్ని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పట్టీని ఎలుకలపై ప్రయోగించినప్పుడు వాటిలోని రోగ నిరోధక వ్యవస్థ.. కరోనా వైరస్‌ను నాశనం చేసే నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేశాయి. రెండు వారాల్లోనే వీటి సంఖ్య భారీగా పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహిళా క్రికెట్‌కు ప్రత్యేక ప్రసారదారు!

ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి గొప్ప స్పందన రావడంతో అమ్మాయిల ఆటకు సంబంధించి ప్రత్యేక ప్రసారహక్కుల కోసం ఐసీసీ.. బిడ్లను ఆహ్వానించే అవకాశముంది. 2023 నుంచి 2031 మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం ఈ నిర్ణయం తీసుకోనుంది. కంగారూ గడ్డపై జరిగిన ఆ ప్రపంచకప్‌.. 101 కోట్ల వీడియో వీక్షణలతో కొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రత్యేక ప్రసార హక్కుల కోసం బిడ్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉంది. ఆ దిశగా అడుగులు పడనున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్‌ను అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ర్యానిటిడిన్‌ వద్దే వద్దు

కడుపులో అల్సర్ల నివారణకు, వాటి వల్ల వచ్చే ఇతరత్రా అనారోగ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా విసృతంగా వినియోగించే ‘ర్యానిటిడిన్‌’ను అమెరికా విపణి నుంచి పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఔషధ సంస్థలకు యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) నిర్దేశించింది. ఈ ఔషధాన్ని వినియోగిస్తే కేన్సర్‌ ముప్పు పొంచి ఉన్నట్లు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేలినందున, ఈ మేరకు స్పష్టమైన సూచనలు ఇస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ‘ర్యానిటిడిన్‌’ను నిషేధించలేదు కానీ పంపిణీ - విక్రయాలు వద్దని ఔషధ కంపెనీలకు సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంట్లో ఉండండి బాబూ ఇంట్లో ఉండండి!

సామాజిక బాధ్యత విషయంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. సమాజానికి ఏ కష్టం ఎదురైనా సరే... అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ‘నేనున్నా’ అంటూ ముందుకొస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తూ ఆదుకునే సినీ ప్రముఖులు కొంతమంది. కవులు, కళాకారులైతే జనాన్ని జాగృతం చేస్తూ మరింత ధైర్యాన్ని నూరిపోస్తుంటారు. తమ పాటలతో సామాన్యుడిలో అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. గీత రచయిత అనంతశ్రీరామ్‌, సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, సంగీత వాయిద్యకారుడు సాయి తదితరులు కలిసి ‘ఇంట్లో ఉండండి’ అంటూ ఒక పాటని రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.