భారత్‌లో 70వేలు దాటిన కరోనా కేసులు!
close

తాజా వార్తలు

Updated : 12/05/2020 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 70వేలు దాటిన కరోనా కేసులు!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3244 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70,756 చేరింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 87 మరణాలు సంభవించగా.. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 2293 మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్‌ సోకినవారిలో ఇప్పటివరకు 22,454 మంది కోలుకోగా మరో 46,008 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా వలస కార్మికుల తరలింపు, లాక్‌డౌన్‌ సడలింపు ఇస్తున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

మహారాష్ట్రలో 868, గుజరాత్‌లో 513 మరణాలు..

కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌లలో మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ప్రతిరోజు కొత్తగా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం అక్కడి పరిస్థితికి అద్ధం పడుతోంది. నిన్న ఒక్కరోజే 1230పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 23,401కి చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ సోకిన వారిలో 868 మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్‌లోనూ మరణాల రేటు కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8541 కేసులు నమోదు కాగా 513మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనాతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 3785 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 221మంది మరణించారు.

తమిళనాడులో 8వేలు దాటిన కేసులు...

తమిళనాడులో కరోనా తీవ్రత ఉగ్రరూపం దాలుస్తోంది. చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్‌ కరోనా వ్యాప్తికి కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే తమిళనాడులో 798మంది ఈవైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8002కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 53మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 2063 కేసులు నమోదుకాగా 190మంది మృత్యువాతపడ్డారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 113కు చేరగా 3988 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో 2018, తెలంగాణలో 1275 కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో నిన్న కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1275కి చేరగా ఇప్పటివరకు 30మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నాడు 38పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2018కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 45మంది చనిపోయారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని