భారత్-కివీస్‌: కొవిడ్‌పై పోరులో ఎక్కడ తేడా?
close

తాజా వార్తలు

Updated : 10/06/2020 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్-కివీస్‌: కొవిడ్‌పై పోరులో ఎక్కడ తేడా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు దేశాలు. ఒకేసారి లాక్‌డౌన్‌. ఇంచుమించు ఒకే విధానం. కానీ, ఓ దేశం కరోనాపై విజయం. ఇంకో దేశం విజయం దిశగా పయనం. ఆ రెండు దేశాలే భారత్‌, న్యూజిలాండ్‌. 50 లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్‌ కరోనా లేని దేశంగా అవతరించింది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో మాత్రం కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇంతకీ న్యూజిలాండ్‌ ఎలా కట్టడి చేసింది? ఇంతకీ మన లోపమెక్కడ?


న్యూజిలాండ్‌ సమష్టి విజయం

* ‘‘కరోనాను కలసి కట్టుగా నిర్మూలిద్దాం. కష్టాలు రాబోతున్నాయి. కానీ వాటిని అందరికంటే ముందే దాటేద్దాం’’ అంటూ ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ దేశ ప్రజలకు సంక్షిప్త సందేశాలు పంపించి యుద్ధ సన్నద్ధులను చేశారు.

* మార్చి 15న న్యూజిలాండ్‌ విదేశీ ప్రయాణికుల రాకను నియంత్రించింది. కేవలం ఆ దేశీయులను మాత్రమే అనుమతించింది. వారినీ 14 రోజుల హోం క్వారంటైన్‌కు పంపింది.

* మార్చి 25న ఆ దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. లెవల్‌-4 లాక్‌డౌన్‌ కింద కేవలం నిత్యావసర, మందుల దుకాణాలు, ఆస్పత్రులు, గ్యాస్‌ స్టేషన్లను మాత్రమే తెరిచారు. వాహనాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. 

* ఏప్రిల్‌ 27న లాక్‌డౌన్‌ను లెవల్‌ 4 నుంచి లెవల్‌-3కి మార్చారు. అప్పటికి ఆ దేశంలో కేసుల సంఖ్య 1472. మృతుల సంఖ్య 19.

* కేవలం లాక్‌డౌన్‌ మీద ఆధారపడకుండా కొవిడ్‌-19 పరీక్షలను ఆ దేశం వేగవంతం చేసింది. ఒక మిలియన్‌ జనాభాకు  ప్రపంచంలోనే అత్యధిక టెస్టులు చేసిన దేశంగా నిలిచింది.

* దీనికి తోడు ద్వీపం కావడం కలిసొచ్చింది. పైగా జనసాంద్రత కూడా తక్కువ కావడం వైరస్‌ విస్తృతికి అవకాశం లేకుండా పోయింది.

*  ఎప్పటికప్పుడు ప్రజల సంచారంపై నిఘా ఉంచింది.


ముందుగా మేలుకొన్నా.. దక్కని ఫలితం

* దేశంలో కరోనా కేసులు వెలుగు చూసిన తొలినాళ్లలోనే మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అప్పట్లో మొత్తం కేసుల సంఖ్య 519. అప్పటికి న్యూజిలాండ్‌లో కేసుల సంఖ్య 205.

* విదేశీ ప్రయాణాలపై నిషేధం, విదేశాల నుంచి వచ్చిన వారిని హోంక్వారంటైన్‌ వంటివి న్యూజిలాండ్‌ మన ప్రభుత్వమూ సమానంగా చేసింది. అయితే ఇక్కడే కొన్ని లోపాలు వెలుగుచూశాయి. చాలా చోట్ల హోంక్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు యథేచ్ఛగా బయటకొచ్చిన సందర్భాలు మనం చూశాం. అలాగే ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు పారిపోయిన ఉదంతాలూ చూశాం.

* లాక్‌డౌన్‌ సమయంలో కేవలం నిత్యావసరాలకే ప్రజలకు అనుమతిచ్చినప్పటికీ భౌతిక దూరాన్ని ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోకపోవడం ప్రధాన లోపం.

* దీనికి తోడు వలస కూలీలను తరలించే క్రమంలోనూ భౌతిక దూరం పెద్దగా పట్టించుకోకపోవడం కరోనా విస్తృతికి కారణం.

* కరోనా పరీక్షలు కూడా దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో జరగకపోవడం వ్యాధి ఉన్నప్పటికి లక్షణాలు బయటకు కనిపించనివారు వ్యాప్తికి కారణమయ్యారు. ఇప్పటికీ అవుతున్నారు. ఐసీఎంఆర్‌ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి మాత్రమే పరీక్షలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 1.45 లక్షల పరీక్షలు చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

* దేశంలో జనాభా సంఖ్య ఎక్కువ కావడం, జనసాంద్రత ఎక్కువగా ఉండడం కేసుల పెరుగుదలకు కారణమైంది.

వెరసి మనతో పాటు లాక్‌డౌన్‌ విధించిన న్యూజిలాండ్‌ జూన్‌ 8 నాటికి కరోనా ఫ్రీ దేశంగా అవతరరించింది. అదే సమయంలో మన దేశం 2.67 లక్షల కేసులతో ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచింది. భౌతిక దూరం, మాస్కు ధరించాలన్న ప్రభుత్వ వినతిని మనం గాలికొదిలేశామన్నది నిష్టూరసత్యం. ఈ విషయంలో న్యూజిలాండ్‌ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి విజయం సాధించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని