ప్రజల వద్దకే నిత్యావసరాలు తీసుకెళ్లండి:పవన్‌
close

తాజా వార్తలు

Updated : 26/03/2020 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజల వద్దకే నిత్యావసరాలు తీసుకెళ్లండి:పవన్‌

ట్విటర్‌ ద్వారా సీఎం జగన్‌కు జనసేనాని విజ్ఞప్తి

అమరావతి: హైదరాబాద్‌ హాస్టళ్ల నుంచి వచ్చిన వాళ్లు ఏపీ సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్నారని.. రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టి వారిని స్వస్థలాలకు పంపాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఏపీ సీఎం జగన్‌కు పవన్‌ విజ్ఞప్తి చేశారు.

చర్చించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు

‘‘హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నో అబ్జెక్షన్ పత్రాలతో బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ వారిని సరిహద్దుల్లో ఆపివేయడంతో నడిరోడ్డుపై ఇప్పటికీ ఇబ్బందులుపడుతున్నారు. హాస్టల్స్ మూసివేతపై రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. వీరిలో చదువుకుంటున్నవారు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులు ఉన్నారు. వారి వేదనను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకొని స్వస్థలాలకు చేర్చాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించండి. అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే కొత్త సమస్యలు వస్తాయి’’ అని పవన్‌ అన్నారు.

వారికి ఎన్‌-95 మాస్కులు అందించండి

‘‘రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందిలో అందరికీ ఎన్-95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షించే సిబ్బందితో పాటు సంబంధిత వైద్యులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, రక్షణ దుస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగంలో ఉన్నవారికీ వీటిని అందించడం అవసరం. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యతో పాటు వాటిలో శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలి’’ అని సీఎంకు సూచించారు.

ఆ ఏర్పాట్లు చేయకపోతే ఎలా?

‘‘నిత్యావసరాల కోసం రైతు బజార్లు, కిరాణా దుకాణాల దగ్గర జనం ఇప్పటికీ క్యూ కడుతున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత ఉండదు. అన్నీ అందుబాటులోకి తీసుకువస్తామనే భరోసాను ఏపీ ప్రభుత్వం కల్పించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం బలంగా చెబుతున్నా... రైతు బజార్లలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోతే ఎలా? ప్రజల ముంగిటకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకువెళ్తే రోడ్డు మీదకు జనం రావడం గణనీయంగా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి’’ అని జనసేన అధినేత విజ్ఞప్తి చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని