close

తాజా వార్తలు

Updated : 30/09/2020 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సర్వేలన్నీ తెరాసకే అనుకూలం: కేటీఆర్‌

15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదు
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశం

హైదరాబాద్‌: నిబంధనల ప్రకారం నవంబర్‌ రెండోవారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగవచ్చని.. ఎమ్మెల్సీతో పాటు బల్దియా ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆన్‌లైన్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు సహా త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల అంశంపై చర్చించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. 

ఐదేళ్లలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు. నగరంలో ప్రజల ఆస్తులపై వారికి సంపూర్ణ హక్కులు దక్కకుండా కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్థిరాస్తులపై యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని.. దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు మంత్రి సూచించారు. గత ఐదేళ్లలో హైదరాబాద్‌ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. రూ.వేల కోట్లతో తాగునీటి ఇబ్బందులు తొలగించామని.. రూ.వందల కోట్లతో రహదారులను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించామన్నారు. గత ఐదేళ్లలో నగర అభివృద్ధికి రూ.67వేల కోట్లు ఖర్చుచేశామని కేటీఆర్‌ వివరించారు. దీనిపై ప్రగతి నివేదిక విడుదల చేయనున్నట్లు చెప్పారు.

హీనపక్షంలో 91 సీట్లు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. మొదటి రోజే కుటుంబసభ్యులతో కలిసి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేలా నగరంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటే బల్దియా ఎన్నికలకు కూడా సమాయత్తం కావాలన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో మంచి పేరుందని.. సర్వేలన్నీ తెరాసకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. హీనపక్షంలో 91 సీట్లు వస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది కార్పొరేటర్ల పనితీరు అంతగా బాగోలేదని హెచ్చరించారు. ఇప్పటికైనా వారు పనితీరును మార్చుకోవాలని సూచించారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. వచ్చే నెల 15న కార్పొరేటర్లతో మరోమారు సమావేశమవుతానని కేటీఆర్‌ చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.