మళ్లీ లాక్‌డౌనా? అలాంటి ఆలోచన లేదు
close

తాజా వార్తలు

Updated : 15/06/2020 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ లాక్‌డౌనా? అలాంటి ఆలోచన లేదు

లాక్‌డౌన్‌ ప్రచారంపై గుజరాత్‌ సీఎం రూపానీ


అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ప్రణాళిక ఏదీ తమ ప్రభుత్వానికి లేదని సీఎం విజయ్‌ రూపానీ సోమవారం స్పష్టంచేశారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. వాస్తవ విరుద్ధమైన ఇలాంటి ఊహాగానాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. 

జూన్‌ 1 నుంచి నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌లలో పరిశ్రమలు, కార్యాలయాలు, బస్సులు, ఆటోలకు అనుమతులు ఇవ్వడంతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితిలోకి వస్తోందని ఆయన ఓ ప్రటకనలో పేర్కొన్నారు. వ్యాపారం, వాణిజ్య సంబంధమైన కార్యకలాపాలు సైతం పుంజుకుంటున్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగుతుందనీ.. ప్రజలు కూడా ఈ వైరస్‌తో కలిసి బతకడం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

గడిచిన నెల రోజులుగా గుజరాత్‌లో రోజుకు సగటున 400 కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 23,590 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 1478 మంది మృత్యువాతపడ్డారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని