కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!
close

తాజా వార్తలు

Published : 17/06/2020 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!

డెక్సమెథసోన్‌ ప్రయోగ ఫలితాల్లో పురోగతి!
బ్రిటన్‌ శాస్త్రవేత్తలను ప్రశంసించిన WHO

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ‘డెక్సమెథసోన్‌’ అనే జనరిక్‌ ఔషధం కరోనా రోగుల్లో మరణాల తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రాథమిక ప్రయోగాల్లో నిరూపితమైందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఈ మధ్యే ప్రకటించారు. తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా దీన్ని ధ్రువీకరిస్తూ కరోనా ఔషధ పురోగతిలో ఇది గొప్ప విషయమంటూ బ్రిటన్‌ శాస్త్రవేత్తలను ప్రశంసించింది.

‘ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగుల మరణాల సంఖ్యను తగ్గించడంలో ఉపయోగపడుతున్న మొదటి ఔషధం ఇదే’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ప్రకటించారు. ఎంతో మంది ప్రజలను కాపాడగలిగే ఈ ఔషధం ప్రయోగాల్లో పురగతి సాధించేందుకు కృషిచేసిన బ్రిటన్‌ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ను అభినందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. వీరితోపాటు ఈ పురోగతికి దోహదపడిన ఆసుపత్రులు, రోగులను కూడా అభినందిస్తున్నామని తెలిపారు.

డెక్సమెథసోన్‌ ఔషధం ప్రయోగ ఫలితాల గురించి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులతో పంచుకున్న అనంతరం WHO ఈ ప్రకటన చేసింది. దీనిపై మరింత విశ్లేషణ అనంతరం పూర్తి సమాచారం ఇస్తామని తెలిపింది. అయితే, ఈ ఔషధాన్ని కొవిడ్‌ రోగులకు ఎలా, ఎప్పుడు వినియోగించాలో అనే విషయాన్ని WHO ప్రయోగ మార్గదర్శకాల్లో త్వరలోనే పొందుపరుస్తామని తెలిపింది.

అంతకుముందు, ‘‘అతి తక్కువ ధరకు లభించే ఈ ఔషధం కొవిడ్‌-19తో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్నవారికి ఆక్సిజన్‌లా పనిచేస్తోంది’’ అని ఆక్సఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ మార్టిన్‌ లాండ్రే తెలిపారు. ఈ జనరిక్‌ ఔషధం వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రయోగాల్లో గుర్తించామని మరో పరిశోధకుడు పీటర్‌ హార్బీ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని