
తాజా వార్తలు
మమత సోదరుడి సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమ్ బెంగాల్లో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం మమతా బెనర్జీ సోదరుడు కార్తీక్ బెనర్జీ అన్నారు. ప్రజల స్థితిగతులు మెరుగవ్వాలని చెబుతూ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేసే రాజకీయ నాయకుల పట్ల విసుగొచ్చేసిందని పేర్కొన్నారు. త్వరలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికలు సమీపించే కొద్దీ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో పుంజుకున్న భాజపా, స్థానికంగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. భాజపా జాతీయ నాయకులు వరుసగా అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించగా ‘సాధారణంగా రాజకీయాల్లో వంచన గురించి నేను మాట్లాడుతున్నా. రాజకీయాలు ప్రజల స్థితిగతుల్లో మెరుగుదల తీసుకురావాలి. ప్రజాసేవలో ఉన్నవారు మన రుషుల సూచనలు మరిచిపోకూడదు. మొదట ప్రజల గురించి తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలి’ అని కార్తీక్ బెనర్జీ అన్నారు. భాజపాలో చేరే అవకాశాన్ని ఆయన కొట్టి పారేయలేదు. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. నేను చెప్పాలనుకొనేంత వరకు ఏమీ చెప్పను’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
సోనియాజీ పాత ప్రసంగాలు గుర్తుతెచ్చుకోండి!