ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగలేఖ
close

తాజా వార్తలు

Updated : 11/06/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగలేఖ

అమరావతి: ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా మారాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తెదేపా హయాం కన్నా వైకాపా హయాంలో ఆదాయం అధికమైనా అభివృద్ధిలేదని, సంక్షేమాన్ని కుదించారని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలు పేట్రేగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు, ప్రజలకు చేటు ఏర్పడిందన్నారు. వాటిని తెలియజేసేందుకే ఈ బహిరంగలేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఏడాదిగా రైతుల సమస్యలు పరిష్కరించలేక పోయారని, అప్పుల పాలైన రైతులను ఆదుకునే చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం తెదేపా తెచ్చిన సంక్షేమ పథకాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. కరోనా ఉపశమన చర్యల్లో ఘోరంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారని, రూ.87వేల కోట్లు అప్పులు చేశారని దుయ్యబట్టారు. కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా  పెంచేశారని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో 70మంది భవన నిర్మాణ కార్మికులు, 600మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన  వ్యక్తం చేశారు. 

1.8లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేయడంతో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఏడాది పాలనలో వైకాపా లోటుపాట్లను ఎత్తిచూపితే తప్పులు చక్కదిద్దకుండా తెదేపాపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చడానికే విధ్వంసాలకు పాల్పడుతున్నారని, ప్రత్యర్థులపై ప్రతీకారమే లక్ష్యంగా వైకాపా పనిచేస్తోందని మండిపడ్డారు. సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచే తెదేపాపై జగన్‌ కక్షసాధింపు చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ప్రజావేదికను కూల్చేశారన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, వ్యాపారాలకు నష్టం చేయడమే వైకాపా లక్ష్యమన్నారు. బెదిరించి, ప్రలోభపరిచి లొంగదీసుకోవడమే వైకాపా దుష్టసిద్ధాంతమని మండిపడ్డారు.  ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ గనుల యజమానులపై రూ.2వేల కోట్ల జరిమానాలు విధించారని విమర్శించారు. నెల్లూరులో తెదేపా ముస్లిం మైనారిటీ నాయకులు ఇళ్లు కూల్చేశారని, పల్నాడులో భయోత్పాతం నెలకొల్పి తెదేపా కార్యకర్తలను ఊళ్లలోంచి తరిమేశారని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారని, వైకాపా బాధితుల కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాల్సి పరిస్థితి రావడం సిగ్గుచేటని విమర్శించారు. కనీసం.. బాధితుల పరామర్శకు కూడా తనను వెళ్లనీయలేదని చంద్రబాబు ఆక్షేపించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని