close

తాజా వార్తలు

Published : 26/07/2020 21:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’... అక్కడ ఆగింది

చిన్ని ఈగ విలన్‌ను ముప్పతిప్పలు పెడుతుంటే చప్పట్లు కొట్టాం... ఈగ బాధను, కోపాన్ని, ప్రేమను మన కళ్లకు కనిపించేట్లు చేసిందెవరు?
అవంతిక  కోసం బాహుబలి అలా కొండలు ఎక్కేస్తుంటే కళ్లప్పగించి చూస్తుండిపోయాం?... అంత అందంగా ఆ దృశ్యాలు ఎలా వచ్చాయి?
ఎన్టీఆర్‌ను కొమురం భీంగా, రామ్‌చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా మన కళ్లకు ప్రత్యక్షంచేయనున్న ఆ కెమెరా కళ్లు ఎవరివి?
ఇంకెవరి సెంథిల్‌కుమార్‌వే. తెలుగు సినిమా గర్వపడే చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించి... ప్రపంచ ప్రశంసలు అందుకున్న సెంథిల్‌కుమార్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేశారు? ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎక్కడ ఆగిపోయింది? ఎప్పుడు మొదలవుతుంది? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ‘ఈనాడు సినిమా’కు వివరించారు.

?కరోనా నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్‌గా ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు

ప్రస్తుత పరిస్థితిని జీవితంలో ఎవరూ చూడలేదు. సినీ పరిశ్రమలో ఎక్కువ మందితో పని   చేయాల్సి ఉంటుంది. కథా చర్చలు, చిత్రీకరణ అంతా టీంగా చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమాటోగ్రాఫర్‌కు పనిచేయడం కష్ట సాధ్యమనే చెప్పాలి. సినిమాను మళ్లీ కొత్తగా ఎలా తీయాలో నేర్చుకోవాల్సిన సమయం ఇది. 

?‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టెస్ట్‌ షూట్‌ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది

వాస్తవానికి టెస్ట్‌ షూట్‌ చేసి, ఒక అంచనాకు రావాలనుకున్నాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో ప్రతి రోజు 500 నుంచి 600 మంది పనిచేసేవాళ్లు. ఒక్క సారిగా 40 నుంచి 50 మందితోనే షూటింగ్‌ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం... మాకు పెద్ద సవాల్‌ అనిపించింది. అయినా ప్రయత్నిద్దామనుకున్నాం. జులై మొదటివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్దామనుకున్నాం. బయట చూస్తే కేసుల సంఖ్య పెరుగు తుండటంతో సామాజిక బాధ్యతగా మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. తక్కువ మంది సిబ్బందితో షూటింగ్‌ ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నాం.

?లాక్‌డౌన్‌ సమయానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏ పరిస్థితుల్లో ఉంది

మాస్క్‌లు ధరించడం, శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ఇన్నాళ్లు మనం సినిమాల్లోనే చూసి ఆశ్చర్యపోయాం. కానీ ఇప్పుడు అదే నిజమైంది. మార్చిలోనే మా టీమంతా పరిశుభ్రత పాటించేవాళ్లం. కరోనా వచ్చిందని తెలిసి ముందుగానే రాజమౌళి మమ్మల్ని అప్రమత్తం చేశారు. సెట్‌లోకి వచ్చే వాళ్ల శరీర ఉష్ణోగ్రత చెక్‌ చేయడం, మాస్క్‌లు పెట్టు   కోవడం, చేతులు శానిటైజ్‌ చేసుకోవడం చేసేవాళ్లం. ఇలా అయినా షూటింగ్‌ జరిగిపోతుందని భావించాం. హఠాత్తుగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో షూటింగ్‌ ఆపేయాల్సి వచ్చింది. అప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 70 శాతం షూటింగ్‌ పూర్తైంది. ఎడిటింగ్‌, డబ్బింగ్‌ సమాంతరంగా నడిచేవి. విరామం ప్రకటించడం ఒక్కసారిగా ఆందోళన కలిగించింది. అయినా సాధ్యమైనంత త్వరగా మళ్లీ షూటింగ్‌కు వెళ్తామనే నమ్మకం ఉండేది.

?ఇతర దేశాల్లో షూటింగ్స్‌ పరిస్థితి ఏమిటి

కొన్ని దేశాల్లో సినిమా షూటింగ్స్‌ చేస్తున్నారు. అయితే పెద్ద ప్రాజెక్టులు ఇంకా మొదలుపెట్టలేదు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ఏం చేయలేం. నాకు తెలిసి ఇప్పుడు పరిశ్రమలో వర్చువల్‌ టెక్నాలజీ పెరగబోతుంది.

?వర్చువల్‌ టెక్నాలజీని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వాడే అవకాశం ఉందా
బాహుబలి సమయంలో ప్రపంచ సినిమాలో ఏ టెక్నాలజీ ఉందో అదే వాడాం. కరోనా కాలంలో సినిమా టెక్నాలజీలో పెద్దగా మార్పులేవీ రాలేదు. వర్చువల్‌ ప్రొడక్షన్‌ గురించి తెలుసుకోడానికి చాలా సమయం కేటాయించా. ముందు మనం గ్రీన్‌ స్క్రీన్‌లో షూట్‌ చేసేవాళ్లం. ఇప్పుడు గ్రీన్‌స్క్రీన్‌ లేకుండా ఎల్‌ఈడీ ప్యానల్స్‌ పెట్టి షూట్‌ చేస్తున్నారు. స్టార్‌వార్స్‌లో ఆ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఉపయోగించాలా? వద్దా? అనేది మా టీం నిర్ణయం తీసుకుంటుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి.

?‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ఎప్పుడు మొదలుపెట్టొచ్చు 

మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్‌, మే, జూన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జులైలో విజృంభించింది. ఈ పరిస్థితుల్లో షూటింగ్‌ చేయలేకపోవచ్చు. మరో నెల, రెండు నెలలు పట్టే అవకాశాలు లేకపోలేదు. దేవుని దయతో కరోనా కష్టాలు తొందరగా తొలగిపోతే అభిమానులు ఆశిస్తున్న సమయానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తీసుకొస్తాం.

?బాలీవుడ్‌ అవకాశాలను వదులుకున్నారంట. ఎందుకు

బాహుబలి విడుదలయ్యాక బాలీవుడ్‌ నుంచి అవకాశం వచ్చింది. ఒక మంచి సినిమాకు పని  చేద్దామనే ఆలోచనలో ఉండేవాణ్ని. ఇంతలోనే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదలుపెట్టారు. ఆ సినిమా కాదని బాలీవుడ్‌కు వెళ్లలేకపోయా. దీనికి పనిచేయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది.
?ఈ నాలుగు నెలలు కెమెరా ముట్టుకోకుండా ఎలా ఉండగలిగారు
కరోనా వచ్చింది. ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకూడదంటే మొదట్లో బాగానే అనిపించింది. తర్వాత తెలియని బాధ కలుగుతోంది. నేను కెమెరాను, షూటింగ్స్‌ను చాలా మిస్సవుతున్నా. నాకు ఇష్టమైన పని చేయలేకపోతున్నాననే వేదన ఉంది. అయినా ఇలాంటి సమయంలో సామాజిక స్పృహతో వ్యవహరించడమే సరైనది అనిపిస్తుంది. మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టి.. వైరస్‌ వ్యాప్తికి మనం కారణం కాకూడదు కదా. అందుకే ఇంటికే పరిమితమయ్యా. ఇంట్లో వాళ్లతో ఇంత సమయం గడపడం ఇదే మొదటిసారి. భార్య పిల్లలతో గడిపే సమయం ఎక్కువగా రావడం అదృష్టంగా భావిస్తున్నా. రోజూ వర్కవుట్స్‌, యోగా, ధ్యానం చేస్తున్నా. పుస్తకాలు చదువుతున్నా. రకరకాల సినిమాలు చూస్తున్నా.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.