
తాజా వార్తలు
ఓ క్షమాపణ... పోటీకి దారి చూపింది!!
ఈనాడు, విశాఖపట్నం : మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)కి జరుగుతున్న ఎన్నికల్లో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు తెదేపా కార్యాలయం వేదికయింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసుపల్లి గణేష్కుమార్... ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో వైకాపాకు మద్దతు తెలిపారు. ఆయనతో పాటు వెళ్లిన నగరంలోని 36, 37 వార్డులకు చెందిన తెదేపా అభ్యర్థులు కేదారి లక్ష్మి, బంగారు రవిశంకర్ కూడా వైకాపా కండువా కప్పుకున్నారు. అక్కడ వారికి ప్రతికూల పరిస్థితి ఎదురవడంతో తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ‘తప్పు చేశాం. క్షమించండి. తెదేపా తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వండి’ అని కొద్ది రోజులుగా పార్టీ కార్యాలయం, ముఖ్య నేతల చుట్టూ తిరిగారు. ఒక్కసారి పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికి బీఫారాలు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తుదకు వార్డుల్లోని కార్యకర్తలు, స్థానిక నాయకులు మరో అవకాశం ఇవ్వాలని కోరడంతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారిద్దరి చేత బహిరంగ క్షమాపణ చెప్పించారు. ఆ తరువాత విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు రామానాయుడు వారికి కండువాలు వేసి తిరిగి పార్టీలోకి తీసుకొని బీఫారాలు ఇచ్చారు.