close

తాజా వార్తలు

Published : 09/08/2020 06:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తులాభారం

 ఇ. శ్రీనివాసరెడ్డి

కొడుకూ, కోడలూ నిద్రలేచినట్లున్నారు, వాళ్ల గదిలో నుండి అలికిడి వినపడుతుంది. ఉదయాన్నే బెడ్‌కాఫీ తాగటం వాళ్లకు అలవాటు. బెడ్‌కాఫీ ఇద్దామని వాళ్ల గది ముందు నిలబడి తలుపు కొట్టబోయాను. లోపలి నుండి ఏవో మాటలు వినపడటంతో గుమ్మం ముందే ఆగిపోయాను.
వేరేవాళ్లు మాట్లాడకుంటున్నప్పుడు చాటుగా ఉండి వినటం సంస్కారం కాదని తెలిసినా, ఆ మాటలు నా గురించి కావడంతో అక్కడి నుండి కదలలేకపోయాను.
‘‘కనీసం పిల్లాడి పాల ఖర్చుకైనా, నెలకు ఎంతో కొంత అమ్మకు డబ్బులిద్దాం’’ కోడల్ని ప్రాధేయపడుతున్నాడు నా ఒక్కగానొక్క కొడుకు.
‘‘దేనికండీ ఇచ్చేది? పిల్లాడి పాలకెంతవుతుందీ మహా అయితే నెలకు ఓ వెయ్యి కన్నా కాదు. ఆ మాత్రం ఆవిడ సొంత మనవడి కోసం ఖర్చు పెట్టలేదా? ఇంటి అద్దె మొత్తం ఆవిడే తీసుకుంటుందిగా?’’ కొడుకు మాట వినడానికి ససేమిరా అంటోంది కోడలు.
ఇంటి మీద అద్దె ఎంత వస్తుందో నీకు తెలియనిది కాదు. నెలకొచ్చే ఐదువేలల్లో కరెంటు బిల్లు, సరకులు, పాలు, మందుల ఖర్చులు అన్నీ అమ్మే భరించాలి. ఇప్పుడు పిల్లాడి ఖర్చులు కూడా అంటే అమ్మకి కష్టమవుతుందేమో... గట్టిగా మాట్లాడలేక చిన్నగా నసుగుతున్నాడు సుపుత్రుడు.
ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసే శ్రీవారు అర్థాంతరంగా కాలం చెయ్యటంతో, హైదరాబాదులో ఉద్యోగం చేసే కొడుకు పంచన చేరక తప్పలేదు.
కొడుకు పెళ్లి అయ్యేంత వరకూ ఏ బాధా లేకుండా గడిచిపోయింది.
తన ఆఫీసులో పనిచేసే అమ్మాయినే ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే, ఒకటే కులం కాకపోయినా పెద్ద మనసుతో సరేనన్నాను. కొడుకు సంతోషం కన్నా ఏదీ ఎక్కువ కాదనుకున్నాను.
కానీ అదే నే చేసిన తప్పేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ. పెళ్లై రెండు నెలలు గడవకముందే కొడుకు ఇంట్లో నా అస్థిత్వానికే ముప్పు ఏర్పడుతుందనుకోలేదు. కొడుకు ఇంట్లోనే పనిమనిషిగా మసలాల్సివస్తుందని కలలో కూడా ఊహించలేదు.
మన పని మనం చేసుకుంటే తప్పేంటని, కొడుక్కి చెప్పించి పనిమనిషినీ చాకలినీ మానిపించింది కోడలు. మొదట్లో పనిమంతురాలైన కోడలు దొరికిందనుకున్నా కానీ, ఆ పనంతా నా నెత్తిన రుద్దుతుందని ఊహించలేకపోయాను.
పోనీలే వంటపని తను చేస్తుంది కదా... ఖాళీగా కూర్చునే బదులు నేను ఇంటిపని చేస్తే ఏంపోతుందిలే అని సరిపెట్టుకున్నా. కానీ నాలుగు రోజుల్లోనే వంటపని కూడా నాకే అప్పగించింది కోడలు. అదేమంటే ఆఫీసులో పని ఎక్కువయ్యిందని నా కొడుకే కోడలి తరపున వకాల్తా పుచ్చుకున్నాడు.
ఇక చేసేదేమీ లేక మౌనంగా ఇంట్లో అన్ని పనులూ చేస్తూ పనిమనిషిగా బతకటం అలవాటు చేసుకున్నా. కానీ పోనుపోను కోడలికి నా ఉనికే ఇష్టం లేకుండా ఉందని గ్రహించాను. చీటికీ మాటికీ, అయినదానికీ కానిదానికీ నామీద ఫిర్యాదు చేసేది. నా పరిస్థితి కళ్లారా చూస్తున్నా పైకి మాత్రం ఏమీ అనలేని అసమర్ధత వాడిది.
ఒకరోజు కోడలు లేని సమయం చూసి, ‘‘అమ్మా ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఉండడం దేనికి’’ అని అడిగాడు.
వాడి ఆంతర్యం అర్థం చేసుకోలేనంత అమాయకురాలిని కాను నేను. ఇంట్లో నుండి వెళ్లమని చెప్పకనే చెపుతున్నాడు. వాడిని ఇక ఇబ్బంది పెట్టి ఉపయోగం లేదని తెలిసి, ఉన్న పళంగా పెట్టే బేడా సర్దుకుని నా సొంత ఇంటికి వచ్చేశా.

*              *              *

‘‘అత్తయ్యా మిమ్మల్ని మాతో తీసుకెళ్దామనుకుంటున్నాం’’ ఎక్కడలేని ఆప్యాయత కురిపిస్తోంది కోడలు.
ఆ ఆప్యాయత వెనకాల అవసరాన్ని గ్రహించలేనంత అమాయకురాలిని కాదు.
కొడుకు ఇంటినుండి వచ్చేసిన నాటి నుండి, కనీసం ‘నేనెలా ఉన్నాను, తింటున్నానా? లేదా?’ అని కనీసం ఫోనుకూడా చేసి ఎరగదు కోడలు. అటువంటిది ఈరోజు నా గుమ్మం తొక్కిందంటే, నాతో ఏదో అవసరం ఉందని ముందే గ్రహించాను.
‘‘అవునమ్మా, ఇద్దరం ఉద్యోగాలకెళ్తూ పిల్లాడిని చూసుకోవటం కష్టంగా ఉంది’’ అసలు విషయం బయటపెట్టాడు నా కొడుకు.
పిల్లాడు పుట్టిన తర్వాత కనీసం చూడటానికి కూడా రమ్మని పిలవని సుపుత్రుడు ఇప్పుడు పిల్లాడిని చూసుకోవడానికి రమ్మంటున్నాడు ఏమాత్రం సిగ్గుపడకుండా.
మనుషుల మధ్య అవసరాలే తప్ప అనుబంధాలకూ ఆప్యాయతలకూ చోటుండదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?
‘‘ ఇంటిపనీ, వంటపనీ చెయ్యటానికి మనుషుల్ని పెట్టాం అత్తయ్యా. మీకేం ఇబ్బంది ఉండదు. మీరు పిల్లాడిని చూసుకుంటే చాలు’’ చేసిన తప్పు మళ్లీ చేయనన్నట్లు సంజాయిషీ ఇస్తోంది కోడలు.
ఇంటి పనికీ, వంట పనికీ మనుషుల్ని పెట్టుకున్నట్లే పిల్లాడిని చూడడానికి కూడా ఓ మనిషిని పెట్టుకుంటే పోయేది కదా అని మనసులో అనుకున్నా.
‘‘పిల్లాడి కోసం కూడా ఒక ఆయాని పెడదామనుకున్నాం అమ్మా. కానీ ఎంతైనా సొంత మనుషులు చూసినట్లు చూడరు కదా? అందుకని...’’ పెళ్లానికి వత్తాసుగా నసిగాడు ఒక్కగానొక్క సుపుత్రుడు.
అంతకుముందు పనిమనిషిగా ఉపయోగించుకున్నట్లే ఇప్పుడు ఆయాగా ఉపయోగించుకుంటాం అని భార్యాభర్తలిద్దరూ ఎంతో అందంగా చెప్పకనే చెపుతున్నారు. వాళ్ల ఇంటికి వెళితే మాత్రం నా బతుకు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. అలా అని మనవడిని దగ్గరుండి చూసుకునే అవకాశాన్ని వదులుకోలేను. ఏం చేయాలో పాలుపోకుండా ఉంది.
ఓ ఐదు నిమిషాల మౌనం తర్వాత, ‘‘అక్కడి వాతావరణం నాకు సరిపడట్లేదు, కావాలంటే పిల్లాడిని ఇక్కడ వదిలి వెళ్లండి, నేను చూసుకుంటాను’’ అన్నాను భార్యాభర్తలిద్దరితో.
ఆ సమాధానాన్ని వాళ్లు ఊహించలేదేమో, ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు.

*              *              *

తలుపు దగ్గరే ఎక్కువసేపు నిలబడటానికి నా మనసెందుకో అంగీకరించకపోవడంతో ‘బెడ్‌కాఫీ’ ఇవ్వకుండానే వెను తిరిగాను.
బహుశా నా అడుగుల శబ్దం విన్నారో ఏమో, తలుపు తెరుచుకుని బయటకొచ్చింది కోడలు.
‘‘ఏంటత్తయ్యా, పిలవకుండానే వెళ్లిపోతున్నారు’’ అంది వాళ్ల మాటలు విన్నానో లేదో తెలుసుకోవడానికన్నట్లు.
‘‘బెడ్‌కాఫీ ఇద్దామని వచ్చాను, కానీ మీరింకా నిద్రలేవలేదేమో అని వెళ్లిపోతున్నాను’’ అన్న నా సమాధానంతో  వాళ్లమాటలు వినలేదని రూఢీ చేసుకుంది.
‘‘ఇటివ్వండి అత్తయ్యా, ఆయనకు నేనిస్తాను’’ అంటూ నా చేతిలోని కాఫీ కప్పులున్న ట్రే అందుకుంది.
ఇంతలో నా కొడుకు కూడా గదిలో నుండి బయటకొస్తూ, అమ్మా రాత్రంతా ఆలోచించి మేమిద్దరం కలిసి ఓ నిర్ణయానికొచ్చాం’’ అన్నాడు.
‘‘నీకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఉందా?’’ అందామనుకుని కూడా, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకని, ‘‘ఏమిటా నిర్ణయం’’ అని అడిగాను.
ఇంతలో కోడలే ‘‘అవునత్తయ్యా, ఇద్దరం బాగా ఆలోచించాం. పిల్లాడిని మీ దగ్గరే వదిలివెళ్దాం అనుకుంటున్నాం’’ అంది.
అంతకన్నా వాళ్లకు వేరే దారి లేదని నాకు తెలుసు. మనవడిని నా దగ్గరే వదిలి వెళతారని కూడా తెలుసు. ఎందుకంటే నా కోడల్లాగే వాళ్ల అమ్మానాన్నలు కూడా రూపాయి రూపాయి లెక్కలేసుకునే వాళ్లే. వాళ్లెటూ పిల్లాడిని చూడరు.
అయినా ఒక రాయి వేసి చూద్దామనిపించింది. ‘‘నాకన్నా పిల్లాడిని మీ అమ్మానాన్నల దగ్గర వదిలితేనే మంచిదేమో’’ అన్నాను.
‘‘అమ్మానాన్నలిద్దరూ షుగర్‌ పేషంట్లు. వాళ్ల పనులు వాళ్లు చేసుకోవటమే కష్టంగా ఉంది. ఇంక పిల్లాడినేం చూస్తారు అంటూ వాళ్లమ్మానాన్నల పీనాసితనానికి అనారోగ్యం ముసుగేసింది.
‘‘అయినా వాళ్ల దగ్గర ఉంటే పిల్లాడు గారాబంతో చెడిపోతాడు. నువ్వైతే నన్ను పెంచినట్లు క్రమశక్షణతో పెంచుతావు’’ అంటూ భార్యకు వత్తాసు పలికాడు నా కొడుకు.
నేను సరిగ్గా పెంచుంటే, నువ్వు తల్లిని దూరంగా పెట్టే వాడివా అనిపించింది మనసులో. రాముడిలా క్రమశిక్షణతో పెరిగే వాళ్లందరూ ఇంతేనేమో, పెళ్లికానంత వరకూ అమ్మమాట, పెళ్లైన తర్వాత భార్యమాట వింటారు కానీ, తమ బుద్ధికి మాత్రం
పని చెప్పరు.
అందుకనే మనవడిని మాత్రం రాముడిలా కాకుండా, ఎవరినైనా ఇట్టే తన తెలివి తేటలతో మెప్పించే కృష్ణుడిలా పెంచాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా.
మనవడు నా దగ్గరుంటే, వాడిని చూడటానికన్నా కొడుకూ, కోడలూ అప్పుడప్పుడూ వచ్చిపోతారు. ఇన్నాళ్లూ కొడుక్కి దూరమయ్యాననే బాధ కొంతైనా తగ్గుతుందని, అట్టే బెట్టు చేయకుండా మనవడిని నాతో అట్టిపెట్టుకోవడానికి ఒప్పేసుకున్నా.
నా అంగీకారం తెలుపగానే, భార్యాభర్తలిద్దరూ సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు కానీ, పిల్లాడి ఖర్చుల గురించి మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
ఆరోజునుండీ మనవడితోనే నా లోకం అయ్యింది. అంతకుముందు పగలంతా ఏమి చెయ్యాలో తోచేది కాదు. ఇప్పుడు మాత్రం మనవడి పనులతోనే క్షణం తీరకుండా ఉండి ఆర్థికంగా కొంత భారం నామీద పడినా, వాడి బోసినవ్వులు, వాడి ఆటాపాటలతో ఆ భారం నాకు బాధ అనిపించలేదు.
ఇష్టమైన వాళ్లకోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే భరించాలనిపిస్తుంది. ఇష్టం లేనప్పుడు, అయినవాళ్లూ భారంగానే అనిపిస్తారు. కోడలికి నేనంటే ఇష్టం లేదు. కాబట్టే నేను ఆరోజు భారంగా అనిపించాను. లేకపోతే ఒక మనిషికి రెండుపూటలా పట్టెడన్నం పెట్టడం పెద్దకష్టమేమీ కాదు, పైపెచ్చు భార్యాభర్తలిద్దరూ సంపాదించే వారికి అసలేమాత్రం కాదు.
మనవడిని చూడటానికి ప్రతి పదిహేను రోజులకోసారి వాడి నాన్న- అదే నా సుపుత్రుడు వచ్చిపోతున్నాడు. నెలకోసారి కోడలు కూడా వస్తుంది కొడుకుని చూసుకోవడానికి.
వాళ్లు రావడం వల్ల నాకు కూడా కొడుకూ కోడలుకి దూరంగా ఉంటున్నాననే భావన దూరమయ్యింది.
కాలం ఎవ్వరికోసం ఆగదు. ఇట్టే రెండేళ్లు గడిచిపోయాయి. మనవడి సాంగత్యంలో నేను ఒంటరిని అనే ఆలోచన పూర్తిగా తొలిగిపోయింది. కొడుకూ, కోడలూ నన్ను చూడట్లేదనే బాధ కూడా మాయమైపోయింది.

*              *              *

ఎప్పటిలానే పిల్లాడిని చూడటానికి కొడుకూ కోడలూ వచ్చారు. వచ్చిన ప్రతిసారీ వాడిని, ‘‘అమ్మేది... నాన్నేడి... అంటూ వాళ్లని గుర్తుపడతాడా లేదా అని పరీక్షలు పెట్టేవాళ్లు. వాడు మాత్రం ఏమడిగినా నావంక చూస్తూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు.
ఇప్పుడిప్పుడే వాడు వచ్చీరాని మాటలు మాట్లాడుతున్నాడు. ‘‘అమ్మా’’ అనమని కోడలు పిల్ల బలవంతం చేసిన ప్రతిసారీ ‘‘నాని’’ అనేవాడు నావంక చూస్తూ. ‘‘నాన్నా’’ అనమన్నా వాడు ‘నాని’ అనే అనేవాడు. వాడికొచ్చిన ఒకే పదం ’నాని’
‘‘అమ్మానాన్నా’’ అనటంలేదని వాడిమీద కోడలు పిల్ల చేయి చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.
‘‘ఎందుకమ్మా, అభంశుభం తెలియని పిల్లాడిని కొడతావు. వాడే చిన్నగా నేర్చుకుంటాడు’’ అని అడ్డం పడేదాన్ని.
‘‘వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మేం ఎవరమో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది’’ అనేది కోడలు కఠినంగా.
‘‘అవునమ్మా, వాడు నిన్ను తప్ప, మమ్మల్ని అసలు గుర్తుపట్టడంలేదు. నువ్వు వాడిని ఇలా పెంచుతావు అనుకోలేదు అంటూ నా కొడుకు నెపం నామీద తోశాడు.
‘‘అలాగైతే తీసుకెళ్లి వాణ్ణి మీరే పెంచుకోండి’’ అన్నాను కాస్తంత ఆవేశంగా చేయని తప్పుకు దోషిగా నన్ను నిలదీశారని.
‘‘అవునండీ, ఎటూవాడికి రెండేళ్లు దాటుతున్నాయి ప్లేస్కూల్లో చేర్చుకుంటారు. మనతోపాటూ తీసుకెళ్దాం’’ అని భర్తకు ఆదేశాలిచ్చింది కోడలు.
అరె అనవసరంగా తొందరపడ్డాననిపించింది. వాళ్లకు లేని ఆలోచనను తెప్పించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.
ఇప్పుడేమిటి చెయ్యడం... కొడుకూ, కోడలూ అన్నంతపనీ చేసేలావున్నారు. మనవడిని వదిలి ఒక్కక్షణం కూడా ఉండడం నావల్ల అయ్యేట్లులేదు.
ఆరోజు రాత్రి మనవడిని తీసుకెళ్లిపోతే, ఒక్కదాన్నే ఎలా ఉండాలి అనే ఆలోచనలతో నిద్రపట్టలేదు. చివరకు తెల్లవారుజామున ఒక ఆలోచన రావడంతో మనసు స్థిమితపడి నిద్రలోకి జారుకున్నా.
‘‘ఏమిటమ్మా, ఇంకా లేవలేదా? బెడ్‌కాఫీ లేనిదే నీ కోడలు మంచం కూడా దిగదు’’ అంటూ కొడుకొచ్చి నిద్రలేపేదాకా మెలకువ రాలేదు.
కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళుతుంటే, వెనకాలే వచ్చాడు నా సుపుత్రుడు.
నేను కాఫీ కాస్తుంటే, వాడు గుమ్మం దగ్గర నిలబడి, ‘‘అమ్మా పిల్లాడిని ఇంకా ఇక్కడే ఉంచి నీకు భారం చేయదల్చుకోలేదు. మాతో వాడిని తీసుకెళ్దాం అనుకుంటున్నాం’’ అన్నాడు.
‘‘నాకు పిల్లాడు భారం అని చెప్పలేదే మీకు’’ సూటిగా అన్నాను.
ఎప్పుడు వచ్చిందో ఏమో, కోడలు పిల్ల ‘‘అదికాదు అత్తయ్యా, ఇంకా ఇక్కడే వాడిని వదిలేస్తే మమ్మల్ని మరిచిపోతాడేమో అని భయమేస్తోంది. అందుకని, మా ఊళ్లో ప్లేస్కూల్లో వేద్దామని తీసుకెళ్దాం అనుకుంటున్నాం’’ అన్నది బెడ్‌కాఫీ అందుకుంటూ.
మనవడితోపాటూ నన్ను కూడా రమ్మంటారేమో అని ఆశపడ్డాను కానీ వాళ్లకా ఆలోచనే లేనట్లుంది. ఎంతసేపూ పిల్లాడినే తీసుకెళ్తాం అంటున్నారు.
‘‘ప్లేస్కూలు అంటే నెలకు రెండు, మూడు వేలు అవుతుందేమో’’ అన్నాను కనీసం ఖర్చన్నా గుర్తుచేస్తే భయపడి పిల్లాడిని వదిలివెళ్తారేమోనని.
‘‘రెండు, మూడు వేలు ఏమూలకమ్మా ఈ రోజుల్లో. పైపెచ్చు అది ఇంటర్నేషనల్‌ స్కూల్‌. అడ్మిషన్‌ ఫీజు, ట్యూషన్‌ ఫీజు అన్నీ కలుపుకుని ఏడాదికి రెండు, మూడు లక్షలవుతుంది’’ గర్వంగా చెప్పాడు సుపుత్రుడు.
‘‘సరే, మీరు అన్నీ చూసుకునే వచ్చినట్లున్నారు. నేను మాత్రం ఎందుకు కాదనాలి, ఓ ఐదు లక్షలిచ్చి మీ పిల్లాడిని మీరు తీసుకెళ్లండి’’ అన్నాను గుండె ధైర్యం చేసుకుని.
నానుంచి ఊహించని జవాబు రావడంతో, నామాటలు అర్థమయ్యాయో లేక అర్థంకానట్లు నటిస్తున్నారో, భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా... ‘‘ఐదులక్షలేమిటీ...’’ అన్నారు.
‘‘మీ పిల్లాడిని రెండేళ్లపాటూ సాకినందుకు  ఫీజు. మీ పిల్లాడి పాలఖర్చు, జబ్బు చేసినప్పుడు మందుల ఖర్చు అన్నీ కలిపి ఐదు లక్షలు’’ అంటూ రాత్రే తయారు చేసిన పిల్లాడి ఖర్చుకు సంబంధించిన కాగితాన్ని వాళ్ల ముందుంచాను.
ఆ కాగితంలో లెక్కలు చూసి ఓ ఐదు నిమిషాలు మొగుడూపెళ్లాలిద్దరికీ నోట మాట రాలేదు. కొయ్యబొమ్మల్లా చేష్టలుడిగి అలాగే నిలబడిపోయారు.
కోడలే ముందుగా తేరుకుని, ‘‘మనవడిని పెంచినందుకు కూడా డబ్బులు లెక్కకట్టే అత్తగారిని మిమ్మల్నే చూస్తున్నాను అంది ఉబికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ.
‘‘ఇంట్లో అత్తగారు ఊరికినే పడివుంటుంది. ఇంటిపనీ, వంటపనీ ఆవిడచేత చేయిస్తే నాలుగు డబ్బులు మిగులుతాయి అనుకునే కోడలు ఉన్నప్పుడు, మనవడిని సాకినందుకు ఖరీదు కట్టే అత్తగార్లు ఉండడంలో పెద్ద ఆశ్చర్యమేముంటుంది’’ అన్నాను ఏమాత్రం భయపడకుండా.
నా మాటలు సూటిగా కోడలికే తగలడంతో  ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయింది.
‘‘సొంత కొడుకు బిడ్డను పెంచినందుకు డబ్బులడగడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా’’ పెళ్లాం తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు నా కొడుకు.
‘‘కన్నతల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి కూడా లెక్కలు చూసుకునే కొడుకులున్నప్పుడు, నీ కొడుక్కి నేను పెట్టిన ఖర్చును రాబట్టుకోవడంలో తప్పులేదనుకుంటున్నా అన్నాను కాస్తంత కోపంతో’’.
‘‘అంటే మేం నిన్ను చూడలేదనే కక్షతో ఇదంతా చేస్తున్నావా రెట్టించాడు సుపుత్రుడు’’
‘‘ఏ తల్లీ బిడ్డలమీద కక్ష కట్టదు. బిడ్డలే కన్నతల్లుల్ని కాదనుకుంటున్నారు. నీ బిడ్డను తీసుకెళ్లేటప్పుడు, కన్నతల్లిని కూడా తీసుకెళ్లాలని నీకు అనిపించవద్దా?’’ అన్నాను సీరియస్‌గా. నా మాటలకు తల దించుకున్నాడు నా కొడుకు.
‘‘నీ పిల్లాడికి లక్షలు కట్టడానికి నీ దగ్గర డబ్బుందికానీ, కన్నతల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి మాత్రం మీ దగ్గర డబ్బులేదు. ఐదువేలతో అమ్మ పిల్లాడిని ఎలా సాకుతుంది అని ఏనాడన్నా ఆలోచించావా? నీ భార్యా నువ్వూ కలిసి నన్ను ఆయాగా ఉపయోగించుకుంటే నాలుగు డబ్బులు మిగులుతాయని ఆలోచించారేకానీ, ఏనాడన్నా నా మంచి చెడ్డల గురించి ఆలోచించారా’’ అన్నాను మరింత కోపంగా.
‘‘అందుకని ఇప్పుడు మీరు మీ మనవడిని తులాభారం వేస్తున్నారా?’’ గొణిగింది కోడలు.
‘‘తులాభారం వేసేదాన్నే అయితే, నన్ను మీఇంటి నుంచి గెంటినప్పుడే... నీ మొగుణ్ణి పెంచి పెద్ద చేసినందుకు పరిహారం అడిగి ఉండేదాన్ని. రుణానుబంధాలు మరిచిపోయి కేవలం డబ్బుతో మాత్రమే జీవితాలు గడిచిపోతాయి అనుకునే మీలాంటి వాళ్లకు కనువిప్పు కావాలనే, నేను పిల్లాడి కోసం పెట్టిన ఖర్చులిమ్మని అడిగాను. అంతేగానీ ఆప్యాయతలనూ, అనుబంధాలనూ రూపాయి నోట్లకు అమ్ముకునే వ్యాపారిని కాదు’’ అని గట్టిగా సమాధానం చెప్పాను.
నా మాటలు విని భార్యాభర్తలిద్దరూ తలదించుకున్నారు. వాళ్లు తల ఎత్తేలోపే మనవడిని తీసుకొచ్చి వాళ్ల ముందు నిలబెట్టి, ‘‘తీసుకెళ్లండి, మళ్లీ ఎప్పుడు నా గుమ్మం తొక్కకండి’’ అన్నాను.
‘‘మమ్మల్ని క్షమించమ్మా, మేం చేసిన తప్పు మాకు తెలిసొచ్చింది. మామీద దయ ఉంచి నువ్వుకూడా మాతో బయలుదేరు’’ అంటూ కోడలి వంక చూశాడు సుపుత్రుడు.
’’ఇంతకాలం నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమిచండి అత్తయ్యా’’ అంటూ నా చేతులు పట్టుకుంది కోడలు.
‘‘మనలో మనకి క్షమాపణలెందుకమ్మా. బంధాలూ అనుబంధాల విలువ మీకు తెలియ చెప్పాలనే ఇలా చేశాను. కన్నవాళ్లెప్పుడూ పిల్లలకు భారం అనిపించకూడదమ్మా లేకపోతే జీవితమే ఓ తులాభారం అవుతుంది. ఈ రోజు నా కొడుకు తప్పు తెలుసుకుని నన్ను తనతో తీసుకెళుతున్నాడు. కానీ రేపు నీ కొడుకు అసలు అలాంటి తప్పే చేయకుండా మిమ్మల్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకునేట్లు పెంచి పెద్ద చేస్తాను చూడండి’’ అంటూ వాళ్లతో బయలుదేరాను ఆనందంగా.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.