close

తాజా వార్తలు

Published : 26/09/2020 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహమ్మారిని ఆఫ్రికా అడ్డుకుంటోంది

కరోనా కట్టడికి విశేష కృషి 
‘సంఘీభావ’ మంత్రంతో ముందుకు 

ఈనాడు ప్రత్యేక విభాగం : ఆఫ్రికా కరోనాను కట్టడిచేస్తూ పోరాడుతోంది. ఎంతలా అంటే - సంపన్న దేశాలకు సైతం సాధ్యం కాని రీతిలో.. నిపుణుల అంచనాలను తలకిందులు చేసేంతలా.. పేదరికం, అరకొర వనరులు వంటి ప్రతికూల పరిస్థితులను ఎదురీదుతూ ‘సంఘీభావ’ మంత్రంతో ఆఫ్రికా దేశాలు మొక్కవోని సంకల్పంతో ముందుకెళుతున్నాయి.

‘‘కరోనా కట్టడికి తగిన చర్యలు చేపట్టకపోతే ఆఫ్రికా ఖండానికి పెనుముప్పు తప్పదు. ఈ ఏడాదిలో 3 కోట్ల నుంచి 4.4 కోట్ల మంది మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉంది. 1.9 లక్షల మంది చనిపోయే అవకాశాలున్నాయి.’’ దాదాపు 50 దేశాల పరిస్థితిపై మే నెల ప్రారంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరిక ఇది. 130 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా దేశాల్లో అప్పటికి 54 వేలకు పైగా కేసులున్నాయి. 2 వేల మందికిపైగా చనిపోయారు. అదే సమయంలో 32 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 13.31 లక్షల కేసులుంటే, 80 వేల మందికి పైగా చనిపోయారు. 


తాజా పరిస్థితి..
ప్రపంచవ్యాప్తంగా 3.25 కోట్లకు పైగా కేసులు బయటపడగా.. మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 10 లక్షలకు చేరువవుతోంది. అమెరికాలో దాదాపు 72 లక్షల కేసులున్నాయి. 2 లక్షల మందికి పైగా చనిపోయారు. ఆఫ్రికా దేశాల్లో 14.45 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 లక్షల మంది కోలుకున్నారు. దాదాపు 34 వేల మంది చనిపోయారు. అధిక జనాభా.. ఆర్థికంగా వెనుకబాటుతనం ఉన్న ఆఫ్రికాను అమెరికా వంటి సంపన్న దేశాలతో పోలిస్తే కరోనా కట్టడిలో ఈ ఖండం విజయం సాధిస్తోందనే ఈ గణాంకాలు చెబుతున్నాయి. దీనివెనుక ఆఫ్రికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) డైరెక్టర్‌ జాన్‌ కెంగాసాంగ్‌ కృషి ఎంతో ఉంది. ‘నిరాశావహ ఖండం’గా ఓ మ్యాగజైన్‌ పతాక కథనం ప్రచురించిన ఆఫ్రికా నిరాశకు లోనుకాకుండా పోరాడుతోంది. ‘‘మన సమస్యలకు ఆఫ్రికన్‌ తరహా పరిష్కారమే కనుక్కోవాలన్నది తేలిపోయింది. ఆఫ్రికన్‌ ఐక్యతతోనే ఇది సాధ్యం..’’ అంటూ ఘనా తొలి అధ్యక్షుడు క్వామే క్రుమహను చెప్పిన మాటలు ఇప్పుడు స్ఫూర్తిగా నిలిచాయి. కరోనా మహమ్మారి ప్రపంచ సంబంధాలను దెబ్బతీసినప్పటికీ కెంగాసాంగ్‌ మాత్రం ఆఫ్రికా దేశాలు ఒక కూటమిగా పనిచేసేలా కృషి చేశారు. మహమ్మారిని కట్టడి చేయడానికి ఎంతో సహకరించారు. ఫలితంగా కొందరు వేసినట్లు తీవ్రస్థాయి అంచనాలేమీ లేవు. ప్రపంచంలో ఇతర దేశాలు చేయలేని పనులు ఆఫ్రికా చేస్తోందని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ మాజీ ప్రతినిధి గేల్‌ స్మిత్‌ కితాబునిచ్చారు. ప్రఖ్యాత వైరాలజిస్టు కూడా అయిన కెంగాసాంగ్‌ కొవిడ్‌తో పోరాటంలో ఆఫ్రికా కట్టడి చేయగలదని మొదటినుంచీ విశ్వాసంతో ఉన్నారు. 


కారణాలు ఏమిటి?
అంచనాల జోలికి వెళ్లకూడదని ఆఫ్రికా సీడీసీ ముందే నిర్ణయించింది. కొవిడ్‌ నియంత్రణకు ఆఫ్రికాలోని యువ జనాభా ఒక కారణమని ఓవైపు నిపుణులు చెబుతున్నారు. ముందుగా లాక్‌డౌన్‌లు విధించడం కూడా దోహదపడినట్లు చెబుతున్నారు. కెంగాసాంగ్‌ మాత్రం.. మనకు ఇంకా తెలియాల్సింది ఎంతో ఉంది అనే అంటున్నారు. ఒక్క కేసు తిరగబెట్టినా మహమ్మారి విశృంఖలత్వం మొదలుపెడుతుందని ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. మూడేళ్ల క్రితమే అనేక వ్యాధులకు మందుల సరఫరా రేసులో వచ్చిన ఆయన ఇప్పుడు వ్యాక్సిన్‌పైనా పనిచేస్తున్నారు. ‘‘అంతర్జాతీయ సంఘీభావం కుప్పకూలింది. ఈ పరిస్థితులు ఆఫ్రికాను డయాగ్నస్టిక్స్‌ మార్కెట్‌ నుంచి బయటకు నెట్టేశాయి.’’ అని ఆయన ఏప్రిల్‌లో పేర్కొన్నారు. అయితే ఆఫ్రికా నష్టపోతే, ప్రపంచం కూడా నష్టపోతుందని చెబుతూ వచ్చారు. అనంతరం క్రమేపీ మందుల సరఫరా మెరుగుపరచడంపై దృష్టి సారించారు. గతంలో కోటీ 20 లక్షల మంది ఆఫ్రికన్లు ఒక దశాబ్దకాలంలో మృతి చెందిన చేదుజ్ఞాపకాలు ఆయా దేశాల నేతలను వెంటాడుతున్నాయి. హెచ్‌ఐవీ మందుల కోసం బాగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలాంటిది మరోసారి జరగకూడదన్నది కెంగాసాంగ్‌ భావన. చరిత్రలో వైఫల్యం నమోదు కాకుండా మనమంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన అందరినీ చైతన్యపరుస్తూ వచ్చారు. అలాగే ఒకరిపైఒకరు ఆధారపడటం తప్ప మరో మార్గం లేదని కొవిడ్‌-19 నిరూపిస్తోంది.. అని ఘనా అధ్యక్షుడు నానా అకుఫో-అడ్డో ఐరాస సర్వప్రతినిధి సభ ఆన్‌లైన్‌ సమావేశంలో చెప్పారు.
కెంగాసాంగ్‌ మాత్రం ఎవరి సహాయం కోసమో వేచి ఉండొద్దని.. చేయిచాచే స్థితిలో ఉంటామన్న ముద్రను తిప్పికొట్టాలని గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వేదికను ఏర్పాటు చేశాయి. తయారీదారుల నుంచి నేరుగా కొనుగోలు కోసం చర్చలు జరిపాయి. ప్రభుత్వాలు చాలావాటిని పరిశీలించి ర్యాపిడ్‌ పరీక్షల కిట్లను, ఎన్‌95 మాస్కులను, వెంటిలేటర్లను కొనుగోలు చేశాయి. అలాగే కొందరు అధ్యక్షుల కృషి ఫలితంగా వీటిలో కొన్ని ఆఫ్రికాలోనే తయారుచేస్తున్నారు. మహమ్మారి ప్రారంభంలో 2 ఆఫ్రికా దేశాల్లోనే కరోనా పరీక్షలు జరిపేవి. ఇప్పుడు అన్ని దేశాలూ చేస్తున్నాయి. కరోనా కట్టడికి సంబంధించిన అనేక అంశాలపై ఆఫ్రికా సీడీసీ ఆన్‌లైన్‌ శిక్షణ ఇచ్చింది. కొవిడ్‌ టీకాలు తయారుచేయడం ఇప్పుడు తదుపరి అత్యవసర అంశం. దీని విషయమై ఆఫ్రికా దేశాలు ఇప్పటికే ఓ సదస్సు నిర్వహించాయి. టీకా తయారీ, ప్రయోగాలకు సంబంధించి ఉన్న అన్ని అవకాశాలపైనా దృష్టి పెట్టాయి.


పరిమిత వనరులున్నా.. 
‘‘నేను ఆఫ్రికాను, అమెరికాలను పరిశీలిస్తున్నాను. అయితే ఆఫ్రికాపైనే ఎక్కువ ఆశావహంగా ఉన్నారు. ఎందుకంటే నిజాయతీగా చెప్పాలంటే ఆ దేశాల నాయకత్వాలు చక్కగా పనిచేస్తున్నాయి. పరిమిత వనరులే ఉన్నప్పటికీ అద్భుతంగా పనిచేస్తున్నాయి.’’ అని ప్రతి రీజియన్‌లో కొవిడ్‌ దుర్బలత్వ సూచీని తయారుచేస్తున్న సర్గో ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సెమా స్గెయర్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలు కొవిడ్‌ను నియంత్రించడంలో ఆఫ్రికా పనితీరుకు దర్పణం పడుతున్నాయి.  


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.