
తాజా వార్తలు
వయసు 50.. కేసులు 68
కరుడుగట్టిన దొంగ అరెస్టు
రూ.12 లక్షల సొత్తు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న బంగారు గొలుసులు పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్
నారాయణగూడ, న్యూస్‌టుడే: చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న కరడుగట్టిన దొంగను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ (తూర్పు మండలం) పోలీసు బృందం అరెస్టు చేసింది. నిందితుడి నుంచి రూ.12.5 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ అంజనీకుమార్ కేసు వివరాలను వెల్లడించారు. టోలిచౌకి, డీలక్స్ కాలనీలో ఉండే ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ జాఫర్ అలియాస్ అహ్మద్ అలియాస్ షఫీయుద్ధీన్(50) జల్సా జీవితం కోసం చోరీలు చేస్తున్నాడు. 2006 ఉంచి ఇప్పటి వరకు షఫీయుద్దీన్పై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 నేరాలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 కేసులు, సైబరాబాద్ పరిధిలో 38, వరంగల్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్ డీసీపీ జి.చక్రవర్తి ఆధ్వర్యంలో తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.వాసుదేవ్, సి.వెంకటేశ్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందుస్వామిలు రంగంలో దిగారు. నిందితుడిని అరెస్టు చేసి రూ.12 లక్షల విలువ చేసే 23 తులాల బంగారు, వజ్రాల ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.