
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 PM
1. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం?: పవన్
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆర్మీ డే (జనవరి 15) భారతీయులందరికీ పుణ్యదినమన్నారు. వీర జవానుల త్యాగాలను త్రికరణశుద్ధిగా స్మరించుకొనే రోజు ఇదేనన్నారు. ఈ దేశాన్ని కాపాడే వీర పుత్రులకు తన తరఫున, జనసేన తరఫున జేజేలు పలుకుతూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘130కోట్ల మంది భారతీయుల ప్రాణాలను అనుక్షణం రక్షించే జవాన్ల రుణాన్ని మనం ఏమిచ్చి తీర్చుకోగలమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రామమందిరానికి వజ్రాల వ్యాపారుల భారీ విరాళాలు
అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కలిసి శుక్రవారం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ తొలి విరాళం ఇచ్చారు. కాగా.. వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరైన సూరత్‌లోని పలువురు వ్యాపారులు మందిర నిర్మాణం కోసం కోట్లలో విరాళాలివ్వడం విశేషం. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ డోలాకియా.. ఆలయ నిర్మాణం కోసం రూ. 11 కోట్లు విరాళంగా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ప్లేస్టోర్ నుంచి 30 దా‘రుణ’ యాప్స్ తొలగింపు
ఆన్లైన్ రుణాలు ఇస్తూ రుణగ్రహీతలపై వేధింపులకు పాల్పడుతున్న యాప్స్‌పై గూగుల్ ఇండియా చర్యలు తీసుకుంది. పదుల సంఖ్యలో రుణ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. పలు యాప్స్ ద్వారా రుణాలు తీసుకున్న వారిపై అధిక వడ్డీలు విధించి రుణం చెల్లించాలని వేధింపులకు గురిచేస్తుండటంతో ఇటీవల పలువురు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇలాంటి కేసులు అధికంగా నమోదయ్యాయి. యూజర్ రివ్యూలు, ప్రభుత్వ సంస్థల హెచ్చరికల ఆధారంగా.. 30 రుణ యాప్స్ స్థానిక చట్టాలను, యూజర్ ప్రైవసీని ఉల్లంఘిస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
దా‘రుణ’ యాప్‌ల కేసులో మరిన్ని ఆధారాలు
4. మమతకు శతాబ్ది రాయ్ షాక్ ఇవ్వబోతున్నారా?
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ కీలక సమయంలో అనేక మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా అవతరిస్తున్న భాజపాలో చేరుతున్నారు. దీంతో తృణమూల్ - భాజపా నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎంపీ శతాబ్ది రాయ్ కూడా తృణమూల్ కాంగ్రెస్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కేంద్రం × రైతులు: తొమ్మిదో‘సారీ’
వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య తొమ్మిదో విడత చర్చలూ అసంపూర్తిగానే ముగిశాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. అందుకు కేంద్రం ససేమిరా అనడంతో ఈసారి కూడా చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈ నెల 19న మధ్యాహ్నం 12గంటలకు మరోసారి సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ 41 రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రమంత్రుల బృందాన్ని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఈ పోరాటంలో కాంగ్రెస్‌ను ఏదీ అడ్డుకోలేదు: రాహుల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి గర్వపడుతున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అన్నదాతలకు తన పూర్తి మద్దతు ఉంటుందని, వారి వెంటే ఉంటానని స్పష్టంచేశారు. రైతులను కాపాడేందుకు చేసే పోరాటంలో కాంగ్రెస్‌ను ఏదీ అడ్డుకోలేదన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 50 రోజులకు పైగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. 114కు చేరిన యూకే రకం కేసులు
భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ యూకే స్ట్రెయిన్ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా శుక్రవారం మరో ఐదుగురికి స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కొత్తరకం కేసుల సంఖ్య 114కు పెరిగింది. బ్రిటన్‌లో ఈ రకం వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన భారత్.. ఆ దేశానికి కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత జనవరి 8 నుంచి తిరిగి సేవలు ప్రారంభించినప్పటికీ.. యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
టీమిండియా యువ పేసర్ నటరాజన్ చరిత్ర సృష్టించాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఈ ఘనత సాధించాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనకు నట్టూ తొలుత నెట్ బౌలర్ వెళ్లాడు. అయితే ఆటగాళ్ల గాయాలతో అతడికి జట్టులో చోటు దక్కింది. అనంతరం తుదిజట్టులో చోటు సంపాదించి పదునైన యార్కర్లతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేతో నటరాజన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. దూసుకుపోతున్న ‘ఒకే ఒక లోకం నువ్వే’
ఆది, సురభి కీలక పాత్రల్లో శ్రీనివాసనాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట యువతను విశేషంగా అలరిస్తూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అరుణ్ చిలువేరు స్వరాలు సమకూర్చిన పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. సిధ్ శ్రీరామ్ ఆలపించారు. తాజాగా ఈ లిరికల్ వీడియో 5మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఒంటెను ఢీకొని బెంగళూరుకు చెందిన ప్రముఖ బైకర్ మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఈ ప్రమాదం జరగగా తాజాగా పోలీసులు వివరాలు వెల్లడించారు. కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ బెంగళూరులో బైకర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల అతడు తన ముగ్గురు స్నేహితులో కలిసి బైక్‌పై రాజస్థాన్ పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలో జైసల్మేర్‌కు వెళ్తుండగా.. ఫతేగఢ్ వద్ద బుధవారం రాత్రి శ్రీనివాసన్ బైక్‌కు ఒంటె అడ్డువచ్చింది. దీంతో బైకు అదుపుతప్పి ఒంటెను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసన్ తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి