close

తాజా వార్తలు

Published : 30/09/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎదుటి వాడి ఉద్యోగమే గొప్ప!!

ప్రముఖ నటుడు, రచయిత స్వర్గీయ రావికొండలరావు కథ నిరుద్యోగ పర్వం ఎవరికి వాళ్లు తాము చేస్తున్న ఉద్యోగాన్ని ఎందుకు తిట్టుకుంటారో అతనికి అర్థం కాలేదు. ప్రతి వాడికీ ఎదుటి వాడి ఉద్యోగం గొప్పగా కనిపిస్తుందా? ఎందుకు? కథకుల ఫైల్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు కథ నిరుద్యోగపర్వం సెప్టెంబర్‌ విపులలో...

డిగ్రీ పాసయిన తర్వాత రామ్మూర్తి ఏం చేస్తాడని పట్టుకున్నది. బి.యే. పాస్‌ కావాలని రామ్మూర్తి పెద్దలంతా కోరుకున్నట్టే అతను కూడా పాసయి కూర్చున్నాడు. ఐతే రామ్మూర్తి తర్వాత ఏం చెయ్యాలి?! రామ్మూర్తి తండ్రి స్కూల్లో టీచరుద్యోగం చేస్తూ పాతికేళ్లయి గడుపుకొస్తున్నాడు.
బియ్యిడీకి పోతేనో అన్నది అతని తల్లి. ‘‘ఏమన్నా చెయ్యనీ కానీ- వాడిని మరి బడిపంతులుద్యోగం మాత్రం చెయ్యనివ్వను. పాతిక సంవత్సరాలై నేను అందులోనే పడి ఏడుస్తున్నాను. ముక్తి మోక్షం దొరకటం లేదు. ఆ వుద్యోగం ఎందుకూ పనికిరాని వాడు చెయ్యాల్సిందని నా ఉద్దేశం!’’ అని రామ్మూర్తి తండ్రి ప్రకటించాడు. రామ్మూర్తికి ఒక వుద్దేశం అంటూ ప్రత్యేకించి ఏమీ కనిపించటం లేదు. అతని దృష్టికి స్కూలు టీచరు ఉద్యోగం మంచిదే కావచ్చునని తోచింది. సంవత్సరం పొడుగునా సెలవలూ.. పెద్దగా చిరాకు పుట్టించే పని కాకపోవటం.. పదిమంది కుర్రాళ్లు గౌరవంగా నమస్కారాలు పెడుతూ ఉండటం- వంటివి రామ్మూర్తికి మంచిగానే తోచినై. ఐతే తండ్రిమాత్రం ఆ వుద్యోగం ఎందుకొద్దంటున్నాడో అర్థం కాలేదు.

‘‘ఇంతకూ నన్నేం చెయ్యమని నీ వుద్దేశం?’’ అన్నాడు తెగించి తండ్రితో. ‘‘ఏం చేస్తావు? వేరే వుద్యోగాలకోసం చూస్తావు! మీన మేషాలు లెక్క పెడుతూ కూర్చోక, పత్రికల్లోనో ఎక్కడో చూస్తూ ఎక్కడెక్కడ ఏమేం ఖాళీగా వుంటున్నాయో చూసుకో! కాస్త గవర్నమెంటులో పడుంటే, ఎంతయినా మెరుగే. ప్రమోషనులూ, ఇంక్రిమెంటులూ ఆఖరుకు రిటైరైతే ఇంత పింఛను కూడా పారేస్తారు!’’ రామ్మూర్తి వార్తాపత్రికలు గాలించ సాగించాడు. సర్టిఫికెట్లు సంపాయించాడు. దరఖాస్తులు పంపుతున్నాడు! ఇంతలో ఎక్కడి నుంచో రామ్మూర్తి మేనమామ కలగజేసుకున్నాడు. ‘‘ఎందుకురా ప్రతివాడికీ గవర్నమెంటు వుద్యోగాలు? కలకాలం గుమస్తాగా పడి వుండాల్సిందేగా! ప్రమోషనా, వల్లకాడా?! నిత్యం బల్ల దగ్గిర కాయితాలు రాయటం తప్ప పదిమందిలోనూ గౌరవమా, పేరా, ప్రఖ్యాతా? నామాటే చూసుకో. తెల్లవారి లేచి ఆరోగంటకు ఆఫీసుకు పోతాను. సాయంత్రం ఏ ఏడెనిమిది గంటలకో తెముల్చుకుని ఇంటికొస్తే అదృష్టవంతుడినే! గంతలు కట్టిన గానుగెద్దులాగా జీవితాంతం చెయ్యాల్సిన పనే ఇదీ! సాయంత్రం కాసేపు సరదాగా తిరుగుదామంటే ఈ జీవితం నోచుకోలేదు. ఇంత చచ్చినా ఆ జీతంరాళ్లు నోటికూడు దాటవు. ఈ సంసారం అప్పులతోనే నడుస్తున్నది. ఇదెట్లా తీరుతుందో రుద్రుడికే తెలీదు. గుమాస్తాగిరీ మాత్రం చెయ్యకు. ఐనా నీవంటివాడికి గుమస్తా ఖర్మమేంరా? నిక్షేపం లాంటి తెలివితేటలున్నాయ్‌! బోలెడన్ని కథలు రాశావు! ఏ పత్రిక ఆఫీసులోనో నువ్వు వూఁ అంటే ఏ సబ్‌ ఎడిటర్‌ వుద్యోగమో పారేస్తారు. నామాట విని ఆ పని చెయ్యి. కీర్తికి కీర్తి, ఎంత లేదన్నా వందలు దాటిన జీతం తెచ్చుకుంటావు! అటువంటిదాన్లో ఉంటే పైకి రాగల లక్షణాలు నీలో ఉన్నాయి గనక చెబుతున్నాను. ఇలా పనులు చెయ్యగలిగే శక్తి కల వాళ్లు లోకంలో తక్కువ. గుమస్తాకేం, ప్రతివాడూ పనికొస్తాడు’’ అనే ధోరణిలో చెప్పాడు.

రామ్మూర్తికి ఇది బాగానే కనిపించింది. నాలుగయిదు పత్రికా కార్యాలయాలకు దరఖాస్తులు పెట్టాడు. మరో చిత్రం ఏమిటంటే రామ్మూర్తికి నాటకాల సరదా ఉంది. చదువుకునే రోజుల్లో చాలాసార్లు బడిలోనూ కాలేజీలోనూ నాటకాల్లో వేషాలు వేశాడు. కొన్ని బహుమానాలు కూడా సంపాయించాడు!ఇది ఆధారంగా తీసుకుని రామ్మూర్తి స్నేహితులు కొందరు అతణ్ని సినిమా పరిశ్రమలో జేరమన్నారు. చదువుకున్నవాడూ, సంస్కారం, రూపం, రెండూ ఉన్నవాడూ అరుదు అన్నారు. పైగా నాటకాల్లో చచ్చేంత అనుభవం ఉందన్నారు! రామ్మూర్తికి ఈ సలహా కూడా నచ్చింది. ఐతే అతను దేనికీ ఛటాలున నిర్ధారణకు రాలేకపోతున్నాడు! మేనమామ రాసిన విషయాన్నీ, స్నేహితులిచ్చిన సలహాలనూ ఆలోచించి తండ్రితో చెప్పాడు. ‘‘ఇక్కడుండి ఈ పత్రికా కార్యాలయాలకు ఉత్తరాలు రాయటం ప్రయోజనకరంగా కనిపించటం లేదు. ఏ సినిమా డైరెక్టర్‌నో కలుసుకుని అతని దగ్గర అసిస్టెంటుగా వుండటానికి అడగనూవచ్చు, పత్రికాధిపతులను కలవనూవచ్చు. నేను అనేదేమిటంటే ఒకటి రెండు నెలలు మద్రాసులో ఉండి ప్రయత్నం చేద్దామని!’’

👆 పూర్తి కథ చదవడానికి క్లిక్‌ చేయండి... లాగిన్‌ అవ్వండి👆


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.