
తాజా వార్తలు
పదోన్నతులు పారదర్శకంగా ఉండాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: పదోన్నతులు పూర్తి పారదర్శకంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, పంచాతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లోని పదోన్నతుల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు అడిగినా ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పదోన్నతుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, భవిష్యత్తులో ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలోని తన ఇంట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా పదోన్నతుల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతే కాంకుడా ఒకటి రెండు సార్లు నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి జరగాలి
గ్రామాల్లో త్వరగా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి జరగాలని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇటీవల పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో చేపట్టిన పనుల తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారని చెప్పారు. ఈ అభినందనలు అందరి కృషి వల్లనే వచ్చాయని.. మున్ముందు అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని మంత్రి సూచించారు.
ఇవీ చదవండి..
శంషాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సేవలు
పోలేపల్లి సెజ్‌లో ఉల్లంఘనలపై విచారణ