close

తాజా వార్తలు

Updated : 03/03/2021 18:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంజయ్‌..ఐటీఐఆర్‌ తెచ్చే దమ్ముందా?: కేటీఆర్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిపై మంత్రి ఘాటు విమర్శలు

హైదరాబాద్: రాష్ట్రానికి ఐటీఐఆర్‌ తేలేని భాజపా.. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్‌ను మూలకు పెట్టింది భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పలుమార్లు పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఐటీఐఆర్ గురించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ ఓ అబద్ధాల జాతరగా కేటీఆర్‌ అభివర్ణించారు. సొంత పార్టీకి చెందిన కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం సంజయ్‌ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

అక్కడ రాకపోవడానికీ మేమే కారణమా?

‘‘కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బెంగళూరులాంటి నగరంలోనూ ఐటీఐఆర్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. అక్కడ ఆ ప్రాజెక్టు రాకపోవడానికి మా ప్రభుత్వమే కారణమా? 2014 నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, అందజేసిన డీపీఆర్‌లు బండి సంజయ్‌కి ఇస్తాం.. ఐటీఐఆర్‌ తీసుకొచ్చే దమ్ముందా? రాష్ట్ర భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన చేయించాలి. సంజయ్‌కు దమ్ముంటే ఐటీఐఆర్‌ లేదా దానికి సమానమైన మరో ప్రాజెక్టును హైదరాబాద్‌కు తీసుకురాగలరా? కేవలం మీడియాలో ప్రచారం కోసమే అసత్యాలతో లేఖ రాశారు. కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను దాచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేయడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అసమర్థత, ఐటీ రంగం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దేశ వ్యాప్తంగా ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్ మూలన పడటానికి ప్రధాన కారణం. దానిని కప్పిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంపైకి ఆ నెపాన్ని నెట్టేయడం దుర్మార్గం. ఐటీఐఆర్ ఉసురు తీసింది.. ఉత్తరాల పేరుతో డ్రామాలు ఆడుతోందీ మీరే’’ అని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి

ఐటీఐఆర్ వస్తే కొత్తగా కొలువులు వస్తాయని యువకులు, నిరుద్యోగులు పెట్టుకున్న కోటి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతృత్వంలోని ప్రభుత్వమే అని.. ఈ విషయాన్ని తెలంగాణలోని విద్యావంతులందరికీ తెలుసని కేటీఆర్‌ అన్నారు. ఐటీఐఆర్ రద్దు చేస్తామంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ప్రకటనను ఇప్పటికైనా చదువుకోవాలని బండి సంజయ్‌కు ఆయన హితవు పలికారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దు చేసినందుకు తెలంగాణ ప్రజలకు.. ముఖ్యంగా హైదరాబాద్ నగర యువతకి క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని