close

తాజా వార్తలు

Updated : 03/03/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీ ర్యాలీకి దాదా..?

కోల్‌కతా: త్వరలో పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. భాజపాతో సై అంటే సై అనే మమతా బెనర్జీ పాలిస్తున్న పశ్చిమ్‌ బెంగాల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిని ఓడించి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. అందుకోసం ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతాలో మార్చి 7న జరగనున్న ఎన్నికల ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమంలో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. వాటిపై భాజపా స్పందించింది. పాల్గొనాలా? వద్దా? అనేది ఆయన నిర్ణయమేనని వెల్లడించింది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావాలనుకుంటే.. స్వాగతం పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ భాజపా పార్టీ ప్రతినిధి శామిక్ భట్టాచార్య మీడియాతో వెల్లడించారు. దీంతో భాజపాలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్పందిస్తూ.. గంగూలీ చేరికపై ఎటువంటి సమాచారం లేదని, పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలోనూ ఆ ప్రస్థావన రాలేదని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. గంగూలీ జనవరి ఆరంభంలో అనారోగ్యం పాలై  అభిమానులను ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరగా.. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు తొలిసారి యాంజియోప్లాస్టీ చేశారు. పర్వాలేదనుకునే సమయంలోనే మరోసారి ఛాతిలో నొప్పి తలెత్తింది. మళ్లీ పరీక్షించిన వైద్యులు రెండోసారి యాంజియోప్లాస్టీ అవసరమని భావించి మరో రెండు స్టెంట్లను అమర్చారు. పరిస్థితి మెరుగుపడటంతో జనవరి 31న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

కాగా, రాజకీయాల్లో చేరాలని దాదాపై ఒత్తిడి వస్తోందంటూ ఆయన మిత్రుడు, సీపీఎం నేత అశోక్ భట్టాచార్య ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం గంగూలీని వినియోగించుకోవాలని చూస్తున్నారని, అదే ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఆ వ్యాఖ్యలను భాజపా వ్యతిరేకించింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని