
తాజా వార్తలు
‘విజయవాడలో దౌర్జన్యాలకు దిగుతున్నారు’
ఆవేదన వ్యక్తం చేసిన తెదేపా మహిళా అభ్యర్థులు
అమరావతి: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో పోలీసుల ప్రోద్బలంతో వైకాపా నేతలు తమపై దౌర్జన్యాలకు దిగుతున్నారని తెదేపా మహిళా అభ్యర్థులు ఆరోపించారు. తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు్న్నారని 28వ డివిజన్ అభ్యర్థి లిలితా కిశోర్, 31వ డివిజన్ అభ్యర్థి గాయత్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయం తీసుకున్నందున వారికి ఒక్క ఓటూ రాదని తెలుసుకుని వైకాపా నేతలు తమపై దాడికి దిగుతున్నారని ఆరోపించారు.
తమ పార్టీకి చెందిన యువతులు ఓటరు స్లిప్పులు పంచేందుకు వెళితే వారిని మెట్లపై నుంచి తోసేశారని లిలితా కిశోర్ ఆరోపించారు. ప్రచారంలో తమ వెంట ఉన్న నేతలు, కార్యకర్తలను దూషిస్తున్నారని గాయత్రీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే విజయవాడలో వైకాపాకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఆ పార్టీ నేతల తీరుపై స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేస్తే చూసీచూడనట్లు వెళ్లిపోవాలని చెబుతున్నారని గాయత్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.