
తాజా వార్తలు
పుంగనూరు, మాచర్ల మున్సిపాలిటీలు వైకాపాకే!
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
అక్కడ అన్ని వార్డులూ ఏకగ్రీవం
పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాల జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. పుంగనూరు పురపాలికలోని అన్ని వార్డుల్లోనూ వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మొత్తం 31 వార్డుల్లోనూ ప్రత్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వైకాపా నేతలే బరిలో నిలిచారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు పుంగనూరు పురపాలిక పరిధిలోని మూడు వార్డుల్లో నామినేషన్ వేసేందుకు తెదేపా అభ్యర్థులకు అవకాశం కల్పించినప్పటీకీ తెదేపా నుంచి అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి కేవలం వైకాపా అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండడం.. ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో పురపాలిక పరిధిలోని 31 వార్డులూ వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి.
మరోవైపు తెదేపా అభ్యర్థుల సమాచారం తమకు తెలియడం లేదని తెదేపా పుంగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. వైకాపా నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపుల వల్లే తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే స్వచ్ఛందంగా ఎన్నికలను బహిష్కరించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో ఎన్నికలు బహిష్కరించడం ద్వారా పుంగనూరులో వైకాపా చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజలకు తెలిసేలా చేస్తామన్నారు.
పల్నాడు ప్రాంతంలోనూ..
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోనూ ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు, పిడుగురాళ్లలోని మొత్తం 33 వార్డులను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ప్రత్యర్థులెవరూ లేకవపోడంతో అన్ని వార్డులూ వైకాపా వశమయ్యాయి. అయితే ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.